MLA Arava Sridhar Controversy: ప్రజా జీవితంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజం మొత్తం తమ వైపు చూస్తోందన్న వాస్తవాన్ని గ్రహించాలి. లేకుంటే మాత్రం వీధిన పడటం ఖాయం. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( MLA arava Sridhar ) విషయంలో అలానే జరిగింది. రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు బట్టి అపాయాలు పొంచి ఉంటాయి. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ముగింపు అన్నట్టు పరిస్థితి మారింది. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు శ్రీధర్. కానీ ఆ స్థాయి వ్యక్తులు ఎలా ఉండాలో.. ఎంతలా హుందాతనం చూపించాలో నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన మూలంగా ఛాన్స్ ఇచ్చిన పార్టీలు ఇప్పుడు నిందలు మోయాల్సిన పరిస్థితి. గతంలో ప్రత్యర్థి పార్టీ ఇటువంటి వాటి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ఇంతకంటే ఘోరమైన పనులు చేసిన తమ పార్టీ నేతలపై కనీసం చర్యలు తీసుకోలేదు. కానీ జనసేనతో పాటు టిడిపి విలువలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ప్రజలు దానిని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఆ పార్టీలపై ఉంది. దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు చేస్తుంటే ఏ పార్టీకైనా ఇబ్బందికరమే. గతంలో ఇటువంటివి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. దానికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయితే విలువలతో పాలన అందిస్తామని చెప్పారు కనుక ఇప్పుడు ఆ ప్రభావం తప్పకుండా టిడిపి, జనసేనలపై ఉంటుంది.
* సోషల్ మీడియాలో హాట్ టాపిక్
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో( social media) అరవ శ్రీధర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సంబంధిత వీడియోలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసాయి. సర్పంచ్ స్థాయి నుంచి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. కానీ ఈ తక్కువ సమయంలోనే పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాన్ని ప్రమాదంలో పెట్టేశారు. ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు.. చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజం మొత్తం తనను చూస్తూ ఉంటుందన్న సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే అతడు హుందాతనాన్ని పెంచుకుంటాడు. కానీ ఆరవ శ్రీధర్ విషయంలో మాత్రం ఆ హుందాతనం లేకుండా పోయింది.
* రాజకీయ పార్టీలపై నిందలు..
ఈ విశాల సమాజంలో రాజకీయంగా చాలామందికి అవకాశాలు దక్కుతాయి. రకరకాల సమీకరణల రూపంలో అరుదైన అవకాశాలు వస్తాయి. అయితే అవకాశాలు ఇచ్చిన పార్టీలకు మన వ్యక్తిగత వ్యవహార శైలి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడతాయి. ఇప్పుడు ఆరవ శ్రీధర్ విషయంలో కూడా అదే జరిగింది. జనసేన( janasena ) కార్నర్ అవుతోంది. అయితే ఇప్పుడు జనసేన.. గతంలో టిడిపి. అయితే ఈ రెండు పార్టీలు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాయని ప్రజలకు అధినేతలు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి నేత సిద్ధాంతాలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచ్చారు. అటువంటిది ఆ పార్టీ ఎమ్మెల్యే పై ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందికర విషయమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ వారు పట్టించుకోలేదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరవ శ్రీధర్ పేరు ప్రస్తావిస్తూ జనసేన పై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలపై ఇంతకంటే దారుణమైన వీడియోలు బయటకు వచ్చాయి. కానీ వారందరినీ వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసేందుకు అవకాశం రావడంతో అరవ శ్రీధర్ను ప్రస్తావిస్తున్నారు.
* వైసిపి హయాంలో చాలామంది పై ఆరోపణలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది నేతలు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏకంగా న్యూడ్ వీడియో కాల్స్ తో పట్టుబడిన వారు ఉన్నారు. చాలామంది అశ్లీలతకు సంబంధించిన సంభాషణలతో పాటు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఒక్కరంటే ఒక్కరిపై కూడా స్పందించిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న విషయంలో ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే నైతికత గురించి ఎక్కువగా టిడిపి తో పాటు జనసేన మాట్లాడుతాయి. అందుకే చిన్న పొరపాటు దొర్లినా ఇప్పుడు ఆరవ శ్రీధర్ మాదిరిగానే పరిస్థితి ఎదురవుతుంది. పైగా అధికారంలో ఉన్న పార్టీలో ఏ చిన్న సంఘటన జరిగినా భూతద్దంలో కనిపిస్తుంది కూడా. అందుకే పాలకపక్ష నాయకులు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
* చర్యలకు వెనకడుగు వేయకూడదు..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉండకూడదు ఇటువంటి వ్యవహారాల్లో. ఏదైనా ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ ముఖ్యం. లేకుంటే క్రెడిబిలిటీ తగ్గుతుంది. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన నాయకత్వం ఒక అంతర్గత కమిటీని నియమించి.. అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం సరైన దిశలో వేసిన అడుగులుగా కనిపిస్తున్నాయి. అయితే ఆయనపై ఆరోపణలు నిజమైతే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. అయితే అధికారపక్షమైనా.. విపక్షమైనా ఒకటి మాత్రం గ్రహించాలి. నేటి సోషల్ మీడియా యుగంలో ఏ తప్పు కూడా దాగదు అన్న విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది.