AP Politics: అసలు రాష్ట్రంలో ఎన్నికలంటూ లేవు. కానీ రేపో మాపో ఎన్నికలు జరుగుతున్న హడావుడి కనిపిస్తోంది. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు, పర్యటనలతో అధికార పార్టీ నాయకులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రజాప్రతినిధుల దర్పంతో సామాన్య ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరీ ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారు చేస్తున్న ఓవర్ యాక్షన్ పై ప్రజలు నివ్వెరపోతున్నారు. భారీ స్వాగతాలు, సత్కారాలు, అభినందనలు, సభలు, సమావేశాలు, పర్యటనలు, ఆలయాల సందర్శనలతో సామాన్య ప్రజా జీవితానికి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట సీఎం జగన్ విశాఖ పర్యటనలో నగరవాసులు, ఇటు విమాన ప్రయాణికులు పడిన వెతలు తెలిసిందే. అప్పట్టో తనకిష్టమైన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దర్శనానికి జగన్ విశాఖ వచ్చారు. అప్పట్లో గాజువాక నుంచి స్వామివారి ఆశ్రమం వరకూ ట్రాఫిక్ ను నిలిపివేశారు.

షాపులు, వాణిజ్య సముదాయాలు మూయించారు. విమాన ప్రయాణికులైతే రెండు గంటల పాటు కాలినడకన ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. దీనిపై నగరవాసులు పోలీసులు, అధికారులపై రియాక్ట్ అయ్యారు. నిలదీసినంత పనిచేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, మీడియాలో కథనాలు రావడంతో సీఎం జగన్ స్పందించారు. అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అసలు హంగూ ఆర్భాటాలు నచ్చవన్నంత వ్యవహరించారు. కానీ ఇటీవల సొంత జిల్లా కడప వెళ్లిన సందర్భంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. భద్రతా ఏర్పాట్లు పేరిట స్థానికులను ఇళ్లకే పరిమితం చేశారు. మూడున్నర వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.కనీసం సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా బయటకు రానీయలేదు. ఒక్క కడపలోనే కాదు.. కర్నూల్లో ఓ పెళ్లికి వెళ్తే అక్కడా అదే పరిస్థితి. అక్కడ ఇంకా దారుణంగా వ్యవహరించారు. స్థానికుల ఇళ్లకు తాళాలేశారు పోలీసులు. అయితే విశాఖ పర్యటన సమయంలో దొర్లిన తప్పిదాలు మళ్లీ మళ్లీ జరుగుతుండడం చూస్తుంటే జగన్ ఆదేశాలు బేఖాతరు కావడమో… లేకుంటే ఆయన ఉత్త ఆదేశాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా.. బయపడిపోతున్న మహేష్ ఫాన్స్
సీఎంకు తగ్గట్టుగా మంత్రులు
సీఎంకు తగ్గట్టుగానే మంత్రులు వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒక ప్రణాళిక ప్రకారం సొంత ప్రాంతాలకు వెళుతున్నారు. సాధారణంగా 104, 108, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లు, రేషన్ పంపిణీ చేసే వాహనాల ప్రారంభ సమయంలో ప్రభుత్వ పెద్దలు చేసే హడావుడి అందరికీ తెలిసిందే. వేలాది వాహనాలకు పచ్చ జెండా ఊపుతూ విజయవాడ నగరంలో సైరన్ మోతతో సందడి చేశారు. వాటినే మీడియాతో పాటు సోషల్ మీడియాలో చూపించి రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయని ఆర్భాటం చేశారు. గత ప్రభుత్వాలు మాత్రం ఇటువంటి వాహనాలు మంజూరు చేసినా.. జిల్లాలకు, మండలాలకు పంపించేవి. అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను వాటి ప్రారంభించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ చిన్న అంశాన్నీ విడిచిపెట్టడం లేదు. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంటే ఏ పనికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఇటువంటి సమయంలో ప్రజలు అసౌకర్యానికి గురవుతారన్న విషయం మరచిపోతున్నారు. హంగూ ఆర్భాటానికి అలవాటు పడిపోతున్నారు.

ఇప్పుడు కొత్త మంత్రులు అదే కోవలో నడుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఎవరెవరు జిల్లాలకు వెళ్లాలో రాసిచ్చినట్లుగా ఓ స్కీమ్ ప్రకారం మంత్రులు సొంత జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ హడావుడికి ఏమాత్రం తక్కువ చేయడం లేదు. చివరికి ఉన్న మంత్రి పదవిని నిలబెట్టుకుని వచ్చిన వారికి సైతం భారీస్వాగతాలు ఏర్పాటు చేస్తున్నారు. రూ. కోట్లు ఖర్చుపెట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇంత హడావుడో జనానికి అర్థం కాని పరిస్థితి. వారి ర్యాలీలతో ప్రజలకూ ఇబ్బందులే. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషాశ్రీచరణ్ ర్యాలీ వల్ల ఓ పాప మరణించిందన్న దుమారం రేగింది. అదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసులపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఎవరూ నమ్మడం లేదు. ముఖ్యమంత్రి.. మంత్రులు ఎందుకింత అధికార దర్పం ప్రదర్శిస్తున్నారో సామాన్య జనానికి అర్థం కావడం లేదు . పాలించమని అవకాశం ఇస్తే.. తమను ఎన్నుకున్న ప్రజలకే అసౌకర్యం కలిగిస్తే వారు మూల్యం చెల్లించుకునే సమయం ఎంతో దూరంలో లేదని తెలుసుకోవాలి మరీ.
Also Read:Punjab CM: మందు కొట్టి ఆలయంలోకి వచ్చిన ముఖ్యమంత్రి
[…] Sunrisers Hyderabad IPL 2022: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ ఓడిపోతుంది అనుకున్న జట్టు అప్రతిహతంగా విజయాలు సాధిస్తోంది. గెలుస్తుంది అనుకున్నా జట్టు దారుణంగా ఓడిపోతుంది. ప్రస్తుతం సన్రైజర్స్ కూడా ఇలాగే అంచనాలను తలకిందులు చేస్తూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ మీద ఉంది. అయితే ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు వెనుక ఏదో బలమైన కారణం ఉంది. […]