Mekathoti Sucharitha: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి.కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతలు కూటమి పార్టీల్లో చేరారు. అయితే ఇటీవల ఆ చేరికలు తగ్గుముఖం పట్టాయి. అయితే సంక్రాంతి తర్వాత చాలామంది వైసిపి నేతలు పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా నేతలకు ప్రాధాన్యత తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే వారు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి పార్టీకి రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* జగన్ సన్నిహిత నేతగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేస్తున్న చాలామంది నేతలు ఉన్నారు. అటువంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత ఒకరు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆమెకు ఎంతగానో ప్రోత్సాహం అందించారు. జడ్పిటిసి సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. 2009లో ఆమె తొలిసారిగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అందుకే ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో నాలుగో సారి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మేకతోటి సుచరిత
* పొలిటికల్ గా సైలెంట్
గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు సుచరిత( Sucharita ). మొన్నటి ఎన్నికల్లో ప్రత్తిపాడు బదులు తాడికొండ నుంచి పోటీ చేశారు. అది ఎంత మాత్రం ఆమెకు అంగీకారం కాదు. ఎందుకంటే 2009 నుంచి ఆమె ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 2019లో అదే నియోజకవర్గంలో నుంచి గెలిచేసరికి జగన్ మంత్రివర్గంలో హోం మంత్రి పదవి అందుకున్నారు. కానీ విస్తరణలో భాగంగా రెండునర ఏళ్ళకే మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అయితే తనను మంత్రివర్గం నుంచి తొలగించడం పై అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి దూరమవుతారని కూడా ప్రచారం నడిచింది. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్రత్తిపాడు నుంచి తాడికొండ కు మార్చారు. అప్పట్లో కూడా ఆమె అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే గత 19 నెలల కాలంలో ఆమె యాక్టివ్ గా మారింది తక్కువ. అయితే వైసీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జనసేనలో చేరేందుకు ఆమె సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆమె జనసేన లో చేరడం ఖాయమని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.