Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెందారు. ఇకనుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదు అని బలంగా భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన జనసేన కు మద్దతు తెలిపారు. తద్వారా కూటమికి తన సపోర్ట్ అని సంకేతాలు ఇచ్చారు. మెగా అభిమానులు కూడా కూటమికి మద్దతు తెలిపారు. కానీ తనకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకున్నా.. తెర వెనుక తన చుట్టూ రాజకీయాలను ఆపాదిస్తూ లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండిస్తున్నారు. అందుకే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం, వేదిక పంచుకోవడం వంటివి చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అయిన దానికి కాని దానికి.. తన చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడాన్ని కూడా సహించుకోలేకపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.
* బాలకృష్ణ వ్యాఖ్యలతో..
తాజాగా శాసనసభలో నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందుల్లో నెట్టాయి. వాస్తవానికి బాలకృష్ణ నేరుగా చిరంజీవిని విమర్శించలేదు. కేవలం అప్పుడు జరిగిన పరిణామాలపై వివరణ మాత్రమే ఇచ్చారు. గట్టిగా అప్పట్లో ఎవరు అడగలేకపోయారని మాత్రమే అన్నారు. అయితే దానికి చిరంజీవి రిప్లై ఇస్తూ.. అప్పట్లో తాను అడగడం వల్లే టిక్కెట్ల ధర పెంపునకు అనుమతి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే అప్పటినుంచి మెగా అభిమానుల్లో ఒక రకమైన గందరగోళం నిలిపేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అభిమానుల ముసుగులో రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. అయితే ఇటువంటి పరిణామాలు మున్ముందు చాలా జరుగుతాయని చిరంజీవి భావిస్తున్నారు. దీనికి తెరదించాలి అంటే రాజకీయ వేదికలు, ప్రభుత్వ పెద్దలను కలవడం వంటివి మానుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంచికి పోతే చెడ్డ ఎదురవుతోందని భావిస్తున్నట్లు సమాచారం.
* గత కొద్దిరోజులుగా పరిణామాలతో..
అయితే ఇప్పుడు బాలకృష్ణ ఏదో మాట్లాడారని చిరంజీవి ఆ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం( AP government) ఏర్పడి ఏడాది దాటుతున్న ఆ చిత్ర ప్రముఖులు ఎవరు ఏపీ సీఎం చంద్రబాబును కలవలేదు. దీనిని పవన్ తీవ్రస్థాయిలో ఖండించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో థియేటర్ల బంద్ అంశం కూడా దుమారం రేపింది. అప్పట్లో పవన్ ఫైర్ అయ్యారు. అందరి లెక్కలను తేల్చుతానని హెచ్చరించారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆటలో వారు సూత్రధారులుగా కామెంట్స్ వచ్చాయి. అందులో మెగా కుటుంబ సన్నిహితుడు కూడా ఉన్నారు. దీంతో చిరంజీవి కూడా సినీ పరిశ్రమ తీరుపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత.. ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు. కానీ సున్నిత మనస్కుడు కావడంతో అడుగడుగునా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాజకీయాల మాటున ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న భావనకు వచ్చారు చిరంజీవి. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో తన సోదరులు ఇద్దరు కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో తాను రాజకీయాలు, ప్రభుత్వ పెద్దలు విషయంలో కాస్త దూరంగా ఉండటమే ఉత్తమమని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ వ్యాఖ్యల కంటే హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన కుట్ర చిరంజీవికి ఎక్కువగా బాధించినట్లు తెలుస్తోంది.
* సోదరులకు ఇబ్బంది రాకూడదని..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం( Alliance government ) సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలని బలంగా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో తనను అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని గందరగోళానికి దారి తీయడాన్ని చిరంజీవి గుర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకనుంచి దానిపై మాట్లాడేందుకు వీలు లేకుండా చేశారు. ముందస్తు ప్రణాళికతోనే ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. అప్పట్లో జరిగిన పరిణామాలపై మాత్రమే మాట్లాడారు చిరంజీవి. కానీ ఈ ఎపిసోడ్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. అందుకే ఇక్కడ నుంచి ఏ రాజకీయ వేదికలతో కానీ.. ప్రభుత్వ పెద్దలతో కానీ చిరంజీవి కలిసే అవకాశం లేదు. కేవలం సినీ ప్రముఖులకు సలహాలు సూచనలు.. ఇండస్ట్రీ మేలు కోసం జరిగే కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాలని చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.