Homeఆంధ్రప్రదేశ్‌Matsyakara Bharosa Scheme : ఇదేం దారుణం జగనన్నా.. చేపలు అమ్మాలంటే 10వేలు కట్టాలా?

Matsyakara Bharosa Scheme : ఇదేం దారుణం జగనన్నా.. చేపలు అమ్మాలంటే 10వేలు కట్టాలా?

Matsyakara Bharosa Scheme : ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని జగన్ సర్కారు విడిచిపెట్టడం లేదు. చివరకు చెత్తపై పన్ను వేసి మరీ ప్రజలను పిండుకుంటోంది. సంక్షేమం మాటున చార్జీలు, పన్నులు వసూలు చేసి మరీ దారుణంగా వంచించింది. నిరుద్యోగ యువతతో చేపలు, మాంసాలు విక్రయించేందుకు సిద్ధపడింది. దానినే ఉద్యోగం, ఉపాధి అని పెద్దపెద్ద ట్యాగులు ఇస్తోంది. అయితే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం మత్స్యకారుల బతుకుల్లో గుదిబండగా మారనుంది. వారు ఆరుగాలం శ్రమించి వేటాడిన చేపలను విక్రయించాలంటే ప్రభుత్వానికి కప్పం కట్టాలట. ఏడాదికి రూ.10 వేలు కట్టాలంటూ ఏపీ మత్స్యశాఖ ఆదేశాలివ్వడంపై గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారులపై భారం..
ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించింది. లక్షలాది మంది మత్స్యకార జనాభా ఉన్నారు. వేటే వారి ప్రధాన జీవన ఆధారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి ప్రయోజిత కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో మత్స్యకారులకు వలసబాట తప్పడం లేదు. ఏటా ఏప్రిల్ 15 నుంచి 45 రోజుల పాటు వేట నిషేధం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో మత్స్యకార భరోసా పేరిట అందిస్తున్న మొత్తం అరకొరే. ఇతర సంక్షేమ పథకాల పేరిట లబ్ధిదారుల జాబితాలో కోత విధిస్తున్నారు. ఉపాధి హామీ పథకం వంటివి మత్స్యకార గ్రామాల్లో అమలుకు నోచుకోవడం లేదు.

కొత్తగా ఆంక్షలు..
ఇప్పుడు సందట్లో సడేమియా అన్నట్టు వేటాడిన చేపలు అమ్ముకోవడానికి సైతం ప్రభుత్వం ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఏడాదికి రూ. పది వేలు లైసెన్స్ ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఆదాయం లేక.. ఖర్చులు పెరిగిపోయి ఆదాయ మార్గాల కోసం చూస్తున్న ప్రభుత్వానికి చేపలు అమ్ముకునే మత్య్స కారులు కనబడ్డారు. వారిపై పది నుంచి పాతిక వేల రూపాయల వరకూ లైసెన్స్ ఫీజు రుద్దుతున్నారు.ఏపీలో చేతలు అమ్ముకునేవారు ఎక్కువగా చిన్న చిన్న దుకాణాల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు చెరువు దగ్గర .. లేకపోతే నదుల దగ్గర నుంచి తెచ్చుకుని మార్కెట్ల దగ్గర పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. వారికి ఆదాయం.. రోజు కూలీ చేసుకున్నంత వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ వారి వద్ద నుంచి రూ. పదివేలు మాత్రం వసూలు చేసి తీరాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

నిరుద్యోగ యువతకు మాయమాటలు..
పోనీ వీధులు, రహదారులపై చేపలు అమ్ముకునే వారినైనా ప్రశాంతంగా ఉంచిందంటే అదీ లేదు. డిగ్రీలు, పీజీలు చదివిన వారితో ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు ఏర్పాటు చేయించింది. నిరుద్యోగ యువతలో భ్రమలు కల్పించి లక్షలాది రూపాయల పెట్టుబడితో ప్రారంభింపజేసింది. కానీ అవి ఏ మాత్రం సక్సెస్ కాలేదు. వాటికి మాత్రం ఎలాంటి లైసెన్స్ ఫీజు తీసుకోకూడదని ప్రభుత్వం చెబుతోంది. అంటే లైసెన్స్ ఫీజు తట్టుకోలేక.. చేపలు అమ్ముకునేవారిలో ఎవరైనా ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇలా కారణాలు ఏవైనా ప్రభుత్వం మత్స్యకారులపై పగ పట్టినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version