Y S Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) కొత్త సవాల్ ఎదురైంది. ఆయనకు చెందిన భారతి సిమెంట్స్ కు కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. భారతి సిమెంట్స్ కు కేటాయించిన సున్నపు రాయి లీజులు ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఎందుకంటే సరస్వతి పవర్ భూముల విషయంలో వివాదం నడుస్తోంది. ఇప్పుడు అడ్డగోలుగా తన సొంత పరిశ్రమకు సున్నపు రాయి లీజులు ఇచ్చారు అన్నది జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఆరోపణ. అయితే ఒక్క జగన్ భారతీ సిమెంట్స్ కు మాత్రమే కాదు ఎసిసితో పాటు రామ్ కో సిమెంట్ కు సైతం నోటీసులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? లేకుంటే ప్రభుత్వానికి సమాధానం చెబుతారా? అన్నది చూడాల్సి ఉంది.
* 2008లో కొనుగోలు..
ఒకనాటి రఘురామ సిమెంట్సే నేటి భారతి సిమెంట్స్( Bharati Cements ). 2008లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రఘురామ సిమెంట్స్ ను కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ కొనుగోళ్లలో సరైన నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. అప్పట్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్న భూములను భారతి సిమెంట్స్ కు కేటాయించారు. అప్పట్లో సైతం నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి మరణం, తరువాత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ అంశం మరుగున పడిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఈ లీజులను రద్దు చేసింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారతి సిమెంట్స్ యాజమాన్యం. అయితే ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం.. కోర్టు భారతి సిమెంట్స్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకురావాలని కోరడంతో.. తిరిగి సున్నపురాయి భూములను లీజుకు ఇచ్చింది వైసిపి ప్రభుత్వం. అయితే అలా ఉత్తర్వులు 2024 ఫిబ్రవరిలో జారీచేసింది. ఒక్క భారతి సిమెంట్స్ కు ఇస్తే బాగుండదని భావించి ఎసిసి తో పాటు రామ్ కో కంపెనీకి వర్తింపజేసింది.
* కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో..
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం( central government) సున్నపురాయి భూముల లీజుకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలను విధించింది. అయితే ఆ నిబంధనలను పాటించకుండా ఈ లీజులకు ఇచ్చారని కూటమి ప్రభుత్వం అనుమానించింది. అందుకే భారతి సిమెంట్స్ తో పాటు మిగతా కంపెనీలకు సైతం నోటీసులు ఇచ్చింది. అయితే ఇందులో ఎసిసి కంపెనీ అదానికి చెందినది. ప్రస్తుతం అదానీ సైతం చంద్రబాబు సర్కార్‌తో మంచిగానే మెలుగుతున్నారు. ఒకవేళ ఈ లీజు రద్దు అయితే మాత్రం ఇబ్బందికరమే. అందుకే తప్పకుండా ఈ కంపెనీలు కోర్టును ఆశ్రయిస్తాయి. కోర్టు స్టే విధిస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మరో భారీ నష్టం తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.