Perni Jayasudha: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.రేషన్ బియ్యం పక్కదారికి సంబంధించి ఆమెను బాధ్యురాలిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఆయన మచిలీపట్నంలో అందుబాటులోకి రావడంతో వైసిపి నేతలు పరామర్శించారు. దీంతో పేర్ని నాని భార్య కు ముందస్తు బెయిల్ మంజూరు అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 13న ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ విచారణ ఈనెల 19 కి వాయిదా పడింది. అయితే ఇంతలో ఆమె విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు.
* గోదాముల్లో మాయమైన బియ్యం
మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్ని నానికి భారీ గోదాములు ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖకు ఆ గోదాములను అద్దెకు ఇచ్చారు. అక్కడ రేషన్ బియ్యం నిల్వ చేసేవారు. ఈ తరుణంలో 90 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. సంబంధిత పౌరసరఫరాల శాఖ మేనేజర్ తో పాటు గోదాముల యజమానిగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ పై సైతం క్రిమినల్ కేసు నమోదయింది. దీంతో అరెస్టులు తప్పవు అన్న భయంతో పేర్ని నాని కుటుంబం పరారైనట్లు వార్తలు వచ్చాయి.
* భారీగా జరిమానా
అయితే రేషన్ బియ్యం అదృశ్యం అయినట్లు గోదాము యాజమాన్య వర్గాలే పౌర సరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. దానికి బాధ్యత వహిస్తూ రెట్టింపు జరిమానా కట్టాలని అధికారులు ఆదేశించారు. ఆ మేరకు కోటి 70 లక్షల రూపాయలు అపరాధ రుసుం కట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ వస్తుందని పేర్ని నాని వర్గీయులు భావిస్తున్నారు. అందుకే అజ్ఞాతం వీడి మచిలీపట్నం చేరుకున్నారు. వారిని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పరామర్శిస్తున్నారు. అయితే ఇంతలో ప్రతికూల తీర్పు వచ్చినా.. అరెస్టు నుంచి తప్పించుకొని విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.