Nara Lokesh: ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సవాల్ విసిరాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం ఏకపక్షం అయినా.. ఇండియా కూటమి పార్టీల మధ్య ఐక్యతకు మాత్రం ఎంతగానో దోహదపడుతోంది. మరోవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కంటే రాహుల్ గాంధీ బలోపేతం అవుతున్నారన్న టాక్ అయితే మాత్రం ఉంది. అది ఎంత మాత్రం బిజెపికి రుచించడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ముద్ర చాటుకోకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ పార్టీకి తెలుసు. అందుకే జాతీయస్థాయిలో తమ బలం తగ్గలేదని నిరూపించుకునేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికలను వాడుకోవాలని బిజెపి చూస్తోంది. అందులో భాగంగానే ఏపీ నుంచి తన భాగస్వామ్య పక్షాలే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది.
* తెలుగు వ్యక్తి కావడంతో..
ఇండియా కూటమికి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలుగు వ్యక్తి కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి. అందుకే దక్షిణాది రాష్ట్రాల సమన్వయ బాధ్యతలను ఏపీ మంత్రి నారా లోకేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. గత వారమే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని అప్పగించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయ బాధ్యతలతోనే ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి తరుపున కీలక బాధ్యతలు లోకేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పర్యటనకు ముందే లోకేష్ కేరళ వెళ్తున్నారు. కోయంబత్తూర్ లో జరిగే ఒక నేషనల్ మీడియా ఛానల్ నిర్వహించే కాంక్లేవ్ లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు.
* లోకేష్ సేవలు వినియోగించుకోవాలని
అయితే మంత్రి నారా లోకేష్ లో పరిణితిని గమనించింది బిజెపి అగ్ర నాయకత్వం. తండ్రి మాదిరిగానే లోకేష్ సైతం జాతీయస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం వహించగలరని భావిస్తోంది. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో సైతం కేంద్ర పెద్దలు కలుసుకున్న క్రమంలో లోకేష్ చాలా రకాలుగా వారిని మెప్పించారు. అప్పటినుంచి లోకేష్ కేంద్ర ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. బిజెపితో పొత్తు కుదరడం, ఏపీలో కూటమి గెలవడం, కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో లోకేష్ మరింతగా దూకుడు కనబరిచారు. కేంద్ర పెద్దలకు మరింత దగ్గరయ్యారు. వాస్తవానికి జాతీయస్థాయిలో చంద్రబాబు పలుకుబడి ఎక్కువ. కానీ ఆయన రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నారు. అందుకే ప్రధాని మోదీ లోకేష్ సేవలను ఎక్కువగా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను లోకేష్ కు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం భావి నాయకుడు కావడంతో.. భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా లోకేష్ సేవలను వినియోగించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దక్షిణాది బాధ్యతలను అప్పగించారని.. మున్ముందు ఎన్డీఏలో సైతం లోకేష్ కీలక భాగస్వామి అవుతారని తెలుస్తోంది.