Liquor Shops Closed In AP: ఏపీలో( Andhra Pradesh) కల్తీ మద్యం ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో లోతైన విచారణ కొనసాగుతోంది. అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ శాఖ తీగ లాగుతోంది. డొంక మొత్తం కదులుతోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో మరో ఘటన జరిగింది. మద్యం షాపులు నిర్వహించలేమని యజమానులు తేల్చి చెప్పారు. షాపులు మూసి జిల్లా ఎక్సైజ్ అధికారికి తాళాలు అందించడం కలకలం రేపింది. అయితే మద్యం వ్యాపారులు తమకు సరైన లాభాలు రావడం లేదని చెప్పి ఈ చర్యకు దిగడం విశేషం.
* 20% మార్జిన్ కోసం
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీని మార్చింది. అప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. లాటరీ తీసి షాపులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల నాలుగు వందలకు పైగా షాపులను ఏర్పాటు చేసింది. అయితే నోటిఫికేషన్ లో 20 వరకు మార్జిన్ శాతం ఇవ్వడంతో తామంతా మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కానీ అంతలా మార్జిన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మద్యం దుకాణాలు నడిపించలేమని తేల్చి చెబుతున్నారు. నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* మద్యం వ్యాపారుల్లో విద్యాధికులు
గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం దుకాణాలకు చాలామంది ఆసక్తి చూపారు. అసలు ఈ వ్యాపారంతో సంబంధం లేని వారు సైతం పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులు మాత్రమే దరఖాస్తులు చేసుకునేవారు. అయితే మద్యం వ్యాపారంతో దండిగా లాభాలు ఉంటాయని భావించిన ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మొన్న ఆ మధ్యన మార్జిన్ శాతాన్ని పెంచాలని కోరారు. దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు వ్యాపారులు నేరుగా ఆందోళనకు దిగడం మాత్రం విశేషం. మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలు విస్తృతమయ్యే అవకాశం ఉంది.