https://oktelugu.com/

AP Liquor sales : 75 రోజుల్లో.. 6,312 కోట్ల మద్యం ఖతం.. ఎవర్రా మీరు ఇలా ఉన్నారు!

కార్యక్రమం ఏదైనా... వేడుక ఎలాంటిదైనా మద్యం తాగడం అనేది కామన్ గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా మద్యం తాగడాన్ని చాలామంది అలవాటుగా మార్చుకున్నారు. నూటి మందిలో సుమారు 30 నుంచి 40 మంది వరకు మద్యం తాగడాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 09:15 PM IST

    AP Liquor sales

    Follow us on

    AP Liquor sales :  మద్యం మీదనే ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. తమ ఆదాయానికి ప్రధాన వనరుగా మార్చుకుంటున్నాయి. అక్కడ దాకా ఎందుకు గత ఏడాది నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే రెండేళ్లకు మద్యం షాపులకు టెండర్లు ముందుగానే ఆహ్వానించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో.. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా వచ్చిన డబ్బును సంక్షేమ పథకాలకు మళ్లించారు. మద్యం వల్ల దండిగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని వదులుకోవడం లేదు. మనదేశంలో గుజరాత్.. ఇంకా కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలలో మద్యం ఏరులై పారుతుంది. స్వయంగా ప్రభుత్వమే వ్యాపారం నిర్వహిస్తున్న నేపథ్యంలో దండిగా ఆదాయం వస్తోంది. ప్రతి ఏడాదికి ఆదాయం పెరుగుతోంది. ఇక డిసెంబర్ 31 ను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజే వెయ్యి కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టింది. అంతేకాదు మద్యం షాపుల నిర్వహణ సమయాన్ని సవరించింది. తాగినోడికి తాగినంత..

    75 రోజుల్లో..

    ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో 75 రోజుల క్రితం అక్కడి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. దీంతో అక్కడ అమ్మకాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 రోజుల వ్యవధిలో 6,312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 83 లక్షల 74 వేల16 కేసుల లిక్కర్, 26 లక్షల 78 వేల 547 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక డిసెంబర్ 31, జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు లభించేవి కావు. అప్పుడు వారంతా తెలంగాణకు వచ్చేవారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని సవరించడంతో మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు లభ్యమయ్యాయి. దీంతో వారు స్థానికంగా ఉన్న మద్యం దుకాణాల వద్దే మద్యాన్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ప్రభుత్వానికి ఊహించని విధంగా ఆదాయం వచ్చింది. కేవలం 75 రోజుల్లోనే 6,312 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఆదాయం వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.” మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పటి మాదిరిగా నాసిరకం మద్యం లేదు. దీంతో మద్యం కొనుగోళ్లు పెరిగిపోయాయి. నూతన లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. ఇది ఇంకా రెట్టింపు అవుతుందని” అధికారులు పేర్కొంటున్నారు.