Amaravati Capital: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చాలా వేగవంతంగా పనులు చేసేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తొలి ఏడాది అమరావతికి నిధులు సమీకరణ చేసింది. అవి కొలిక్కి వచ్చాక పనులు ప్రారంభించింది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులను సిఆర్డిఏ పర్యవేక్షిస్తోంది. మంత్రి నారాయణ ఆ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ప్రపంచంలో మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే అందుకు ఒక కీలక అడుగుపడాల్సి ఉంది. అమరావతిని ఒక మహానగరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ గురుతర బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుపై ఉంది. కేంద్రాన్ని ఒప్పించి అమరావతి నగరాన్ని చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ప్రపంచ పటంలో అమరావతి అనేది కనిపిస్తుంది. కోట్లాదిమంది కోరిక కూడా అదే.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా చంద్రబాబు.. కారణం అదే!
* నవ నగరాలతో..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. తద్వారా ఒక మహానగరంగా అమరావతి దేదీప్యమానంగా వెలుగొందుతుందని ఆయన ఆశాభావం. 2014లో అదే కోరికతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ అనుకున్న స్థాయిలో అమరావతి నిర్మాణం జరగలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు. దాని ప్రభావం అమరావతి నిర్మాణం పై పడింది. రాష్ట్రంలో అధికార మార్పుతో అమరావతి నిర్వీర్యం అయింది. గత పుష్కర కాలంగా పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకొని అడుగు వేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. లేకుంటే భవిష్యత్తులో గందరగోళంతో పాటు ఇబ్బందులు తప్పవు.
* మహానగరానికి అవసరమైన వనరులు..
దాదాపు 5 జిల్లాల్లో విస్తరించి ఉంది అమరావతి రాజధాని ప్రాంతం. ఈ ఐదు జిల్లాలను కలుపుతూ అమరావతి మహానగరం తీర్చిదిద్దనున్నారు. అయితే అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 80 లక్షల మంది జనాభా ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కోటి మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన అమరావతిని సైతం మహానగరంగా గుర్తించాలంటే జనాభా సరిపోతారు. ప్రాంతాలు సరిపోతాయి. కావాల్సింది మాత్రం మహానగరంగా గుర్తింపు. అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో చట్టం చేసి.. అమరావతిని చట్టబద్ధత చేసి.. మహానగరంగా గుర్తించగలిగితే ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగిన రాజధానిగా అది చలామణిలోకి వస్తుంది. అది చేయాల్సిన బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబు పై ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. లేకుంటే నాడే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించేది. అటు తరువాత జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఏం చేయలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే అమరావతికి చట్టబద్ధత లేదో.. అటు తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయగలిగారు. మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం చంద్రబాబు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అమరావతిని చట్టబద్ధత చేయాలి.
* చట్టబద్ధతతోనే గుర్తింపు..
కేంద్ర ప్రభుత్వం( central government) పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించిన మరుక్షణం.. ప్రపంచ పటంలో కనిపిస్తుంది. పొలిటికల్ గా కూడా కూటమికి మైలేజ్ ఇవ్వగల అంశం కూడా ఇది. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామి. ఏపీకి అన్ని విధాల సహకారం అందిస్తోంది కేంద్రం. ఇటువంటి సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే.. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసినట్టే. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చినా.. మరొకరు వచ్చినా ఏం చేయలేరు. ఇది ముమ్మాటికీ సత్యం.