Lakshmi Parvathi Statement : తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతంగా పూర్తిచేసుకుంది. మూడు రోజుల పాటు కడప వేదికగా సాగిన మహానాడు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కింది స్థాయి కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు వరకూ ఒకే చోట కలిసి చేసుకున్న పండుగ. అధినేత చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ కు టీడీపీ నాయకత్వం నుంచి శ్రేణుల వరకూ నిరాజనాలు పలికారు. భావి నాయకుడిగా లోకేష్ ను అందరూ దీవించారు. ఇక తెలుగుదేశం పార్టీని నడిపించేది లోకేష్ అని ఈ మహానాడు స్పష్టతనిచ్చింది. అయితే ఇప్పటికే టీడీపీ వ్యవహారాలను లోకేష్ చక్కబెడుతున్నారు. పైగా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు.. ఇలా అన్ని రకాల పదవులు దక్కాయి లోకేష్ కు. అయితే పార్టీలో ప్రమోషన్ ఇవ్వడం ద్వారా లోకేష్ ను మరో అడుగులో పెట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Also Read : జగన్ అరెస్టు అప్పుడే.. తేల్చిచెప్పిన సన్నిహితుడు
సరికొత్త మెలిక..
అయితే ఇప్పుడే నందమూరి లక్ష్మీపార్వతి ఒక సరికొత్త మెలిక తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ వారసులుగా ఆయన ఇంటిపేరు కలిగిన మనువలు ఉండాలని..కుమార్తె కొడుకు ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఎందుకంటే టీడీపీ నాయకత్వం లోకేష్ కు అందించడంపై నందమూరి కుటుంబంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నందమూరి బాలక్రిష్ణ అల్లుడే లోకేష్. సో ఆయన వ్యతిరేకించరు. నందమూరి కుటుంబమంతా బాలక్రిష్ణను పెద్ద దిక్కుగా చూస్తోంది. మరోవైపు పురందేశ్వరి సైతం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఇప్పటికే చంద్రబాబుతో ఉన్న విభేదాలు సమసిపోయి.. వారంతా రాజకీయంగా ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉన్నారు. సో ఇప్పుడేమైనా అభ్యంతరాలు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఉండాలి. కానీ ఆయన ఎన్నడూ టీడీపీ వ్యవహారాల గురించి బయట మాట్లాడిన దాఖలాలు లేవు. సినిమాలతో ఆయన బిజీగా ఉంటున్నారు.
30 ఏళ్ల కిందటే పార్టీ షిఫ్ట్..
లక్ష్మీపార్వతి చెబుతున్న వారసత్వంగా చూసుకున్న చంద్రబాబు నుంచి పార్టీ ఆయన వారసుడు లోకేష్ చేతికి వెళుతుంది. 1995లోనే నందమూరి తారక రామారావు నుంచి పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్లింది. అప్పుడే వారసత్వం చేజారిపోయింది. ఇప్పుడు లక్ష్మీపార్వతి గోల చేసినా తిరిగి నందమూరి కుటుంబంలోకి రాదు. పార్టీ శ్రేణులు కోరుకుంటే వస్తుంది. లేకుంటే ఆమె ఆశిస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి యాక్టివ్ గా పనిచేస్తే వస్తుంది. మొన్నటి ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి అత్యంత టఫ్. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ వచ్చింది. కానీ ఆ అవసరం లేకుండానే టీడీపీ సూపర్ విక్టరీ సాధించింది. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఒకే ఒక విజయంతో అందరి నోళ్లు మూయించారు.
లక్ష్మీపార్వతి కంటే ముందుగానే..
టీడీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న మాటే రావడం లేదు. అప్పుడెప్పుడో అనేవారు. కానీ అటు తరువాత జరిగిన పరిణామాలు ఆ స్లోగన్ ను తగ్గించేశాయి. అయితే వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతి ఆ డిమాండ్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు. పోనీ లక్ష్మీపార్వతితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడించేవారు అనుకుంటామంటే కుదిరే పని కాదు. ఎందుకంటే లక్ష్మీపార్వతి కంటే ముందుగానే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లాంటి నేతలు ఇదే రకమైన డిమాండ్ చేశారు. డిమాండ్ కాదు నిష్టూరాలు ఆడేవారు. ఎందుకు ఇవ్వరు అని మాటల దాడిచేసేవారు. 1995లోనే నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబానికి టీడీపీ నాయకత్వం షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడు కూతురు కొడుకైన లోకేష్ ఎలా వారసుడు అని ప్రశ్నించి మరోసారి వార్తల్లో నిలవడం తప్ప లక్ష్మీపార్వతి సాధించింది ఏదీ లేదు.