Pawan Kalyan vs Komatireddy: తెలంగాణ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ( deputy CM Pawan Kalyan)విరుచుకుపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా బీఆర్ఎస్ నేతలు ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దానిని కొనసాగిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వమని.. అనుమతి సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలే తెలియని తేల్చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే నిజంగా వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై కోపంతో ఈ వ్యాఖ్యలు చేశారా? లేకుంటే బి ఆర్ ఎస్ ఈ విషయంలో ముందంజలో ఉందని భావించి చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. మొన్నటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఒక వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చింది. అదే ఇంతటి వివాదానికి కారణం అయింది.
యధాలపంగా వ్యాఖ్యలు
అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima ) జిల్లాలో సముద్ర జలాలు మూలంగా కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. పచ్చటి తోటలు సైతం ఖాళీ అయి అంద విహీనంగా కనిపిస్తున్నాయి. స్థానిక రైతుల విన్నపం మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తోటలను పరిశీలించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కోనసీమ లాంటి అందమైన ప్రదేశం ఉండకపోవడంతో అక్కడి ప్రజలు ఎప్పుడూ బాధపడుతుంటారని.. ఆ దిష్టి తగిలినట్లు ఉందని అర్థం వచ్చేలా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సానుకూల దృక్పథంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పై ఎటువంటి వ్యతిరేక భావనతో వీటిని చేయలేదు. అయితే బిఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ కు బుర్ర లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అటు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒంటరిగా పోటీ చేయలేడు కానీ అంటూ వైసిపి ట్యాగ్ లైన్ తో మాట్లాడారు. ఇప్పుడేమో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలపైనే మాట్లాడారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరికలు పంపారు.
ఆ ముగ్గురు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి?
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెబుతారా? అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే పవన్ వ్యతిరేక భావనతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కానీ తెలంగాణ నేతలు మాత్రం దానిని తప్పుపడుతున్నారు. అయితే అదే తెలంగాణకు సీఎం గా వ్యవహరించిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అయితే ఏపీతోపాటు ఏపీ ప్రజలను, ఇక్కడి నేతలను ఉద్దేశించి కారుకూతలు కోశారు చాలా సందర్భాల్లో. ఈ లెక్కన వారితో ఎన్నిసార్లు క్షమాపణ చెప్పించాలి? అయితే ఇప్పుడు ఏకంగా తెలంగాణ మంత్రి స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ప్రారంభం కావడం ఖాయం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. జనసేన నేతలు సైతం పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలు కూడా అనుకున్న స్థాయిలో అండగా నిలబడడం లేదు.
స్పందిస్తే సెంటిమెంట్ బయటకు..
కచ్చితంగా ఇప్పుడు ఏపీ నుంచి స్పందిస్తే మాత్రం మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి రాజకీయంగా చలికాచుకోవాలని చూస్తోంది బిఆర్ఎస్ పార్టీ. అందుకే ఎందుకైనా మంచిది అని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఈ విషయంలో సెంటిమెంటు అస్త్రాన్ని కెసిఆర్ బయటకు తీస్తే మాత్రం.. అందులో తమ ప్రయోజనం పదిల పరుచుకోవాలని కాంగ్రెస్ భావించింది. అందుకే జగదీశ్వర్ రెడ్డి స్పందించిన తరువాత మాత్రమే ఎమ్మెల్యే తో పాటు మంత్రి స్పందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే దీనిపై మౌనమే మేలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా తెలంగాణ సమాజం తప్పు పట్టేలా మాత్రం పవన్ వ్యాఖ్యలు లేవు. ఆ వ్యాఖ్యల్లో ఉన్న ద్వందర్థాలతో రాజకీయం చేయాలని చూసింది బి ఆర్ఎస్. జాగ్రత్త పడింది కాంగ్రెస్. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు.