Kolusu Parthasarathy: మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దాదాపు వైసీపీని వీడటం ఖాయంగా తేలుతోంది. ఆయన టిడిపిలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొద్ది రోజులుగా సీఎం జగన్ వైఖరి పై పార్థసారథి బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయ కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. పార్థసారథి తో చర్చలు జరిపారు. సీఎం జగన్ తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ అవి ఏవీ కొలిక్కి రాలేదు. సీఎం జగన్ నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాకపోవడంతో పార్థసారథి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కొలుసు పార్థసారథి సీనియర్ నాయకుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో సైతం మంత్రిగా పనిచేశారు. అప్పట్లో వైఎస్ బాగా ప్రోత్సహించేవారు. ఆ అభిమానంతోనే జగన్ వెంట నడిచారు. పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కలేదు. కనీసం విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు. పార్థసారధిని మంత్రిగా అవకాశం ఇస్తే సొంతంగా ఎదిగిపోతారన్న అనుమానం జగన్ లో ఉంది. అందుకే ఆయనను దూరం పెట్టారు. దీంతో పార్థసారధిలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో పార్టీ మారడమే శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈనెల 17న పార్థసారథి టిడిపిలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎప్పటికీ ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని.. చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. పెనమలూరు టిడిపి టికెట్ ను బోడె ప్రసాద్ ఆశిస్తున్నారు. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ, ఇతరత్రా అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ కొలుసు పార్థసారధికి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. పెనమలూరు లో వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పార్టీపై వ్యతిరేకత పెరిగింది. పార్థసారథి సైతం ఈ విషయాన్ని గ్రహించి పార్టీ మారడం ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. అయితే చివరి వరకు పార్థసారధి కోసం వైసీపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారు. అయోధ్యరామిరెడ్డి స్వయంగా పార్థసారధితో చర్చలు జరిపారు. సీఎంవో కు తీసుకెళ్లారు. కానీ టికెట్ విషయంలో జగన్ వైఖరి మారలేదు. దీంతో అక్కడ నుంచి వెనుతిరిగిన పార్థసారథి టిడిపిలో చేరతానని అనుచరులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రచారం జరుగుతున్నట్టు ఈనెల 17న టిడిపిలో చేరతారా? కొద్దిరోజులు వైసీపీలో కొనసాగుతారా? అన్నది చూడాలి.