Kolikapudi Srinivasa Rao: కొందరు నేతల విషయంలో టిడిపి హై కమాండ్ అనవసర కష్టాలను తెచ్చుకుంది. అమరావతి ఉద్యమ నేపథ్యం ఉండడంతో కొలికపూడి శ్రీనివాసరావును టిడిపిలోకి రప్పించి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ దానిని ఒక అవకాశం గా చూడలేదు శ్రీనివాసరావు. లేనిపోని వివాదాలు తెచ్చుకుని.. టిడిపికి ఇబ్బందులు తెచ్చి పెట్టేలా మారింది. గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాలు ఆయన చుట్టూ ముసురుకున్నాయి. తాజాగా ఆయన తన నియోజకవర్గ పర్యటనలో.. 30 గ్రామాల్లో రోడ్లు లేవని.. నిరుద్యోగం తాండవిస్తోందని.. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం పెద్ద దుమారం రేగింది. అయితే ఇవి ప్రజల కష్టాలు కంటే.. ఆయన కష్టాలే అన్నట్టు సెటైర్లు పడుతున్నాయి.
* వివాదాస్పద ముద్ర..
మంచి వ్యక్తిగా కొలికపూడి శ్రీనివాసరావుకు( Srinivasa Rao ) గుర్తింపు ఉంది. కానీ క్రమేపి ఆ ముద్ర తొలగింది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. చివరకు అవినీతి ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. ఆపై సొంత పార్టీ నేతలతో సైతం ఆయనకు పొసగడం లేదు. ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. అధికార పార్టీలో ఉంటూ సమన్వయం చేసుకోవాల్సింది పోయి.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం మాత్రం ఆయన విషయంలో అసహనం కలుగుతోంది. పదేపదే చెప్పి చంద్రబాబు విసిగిపోయారు. అందుకే పూర్తిగా పక్కన పెట్టేసినట్టు ఉన్నారు. దానిని సహించుకోలేక ఆయన ఇటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
* పట్టించుకోని హైకమాండ్..
ప్రస్తుతం తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కొలికపూడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకత్వం పూర్తిగా అసహనంతో ఉంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టారు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీనిని తట్టుకోలేకపోతున్నారు శ్రీనివాసరావు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమి పాలనలో ప్రజలు కష్టాలతో గడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇప్పుడు అదే లైన్ ను తీసుకున్నారు కొలికపూడి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు పూర్తయ్యాయని.. ప్రభుత్వంపై బురద జల్లి పనిని తీవ్రతరం చేయడం ద్వారా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుతారని టిడిపి క్యాడర్ అనుమానిస్తోంది. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని.. పార్టీ గౌరవాన్ని, క్రమశిక్షణను దెబ్బతీసే ఇటువంటి నేతలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని సీనియర్లు సైతం సూచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆయనను విడిచిపెట్టేసారని.. ఇక నిర్ణయాలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవని.. నియోజకవర్గంలో నిమిత్తమాత్రుడు చేయడమే పని అని తేలిపోయింది. సో ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు. ఎటువంటి పవర్స్, ప్రత్యేక గౌరవాలు ఉండవని తేలిపోయింది.