Kiraak RP-Seema Raja:యూట్యూబర్ సీమ రాజా( Seema Raja), జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ లకు బిగ్ షాట్ తగిలింది. వారిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీస్ కేసులు పెట్టారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజాతో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రసారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ఆశ్రయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నేతలపై తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని.. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వీరందరిని తెలుగుదేశం పార్టీ పెంచి పోషిస్తోందని ఆరోపించారు.
ఆ ఇద్దరూ వైసీపీకి వ్యతిరేకం..
జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పి( kiraak RP) తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు. నిత్యం అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అదే సమయంలో యూట్యూబర్ సీమ రాజా సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారు. ఆ పార్టీ కండువా వేసుకొని జగన్మోహన్ రెడ్డి మాదిరిగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. కిరాక్ ఆర్పి, సీమ రాజాలు కలిపి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరును తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా కీలక కామెంట్స్ చేస్తుంటారు. దీంతో వీరిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారు. అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంచలన ఆరోపణలు
తెలుగుదేశం పార్టీ నాయకత్వమే ఇటువంటి వారిని పెంచి పోషిస్తోందని అంబటి రాంబాబు( ambati Rambabu ) సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి నేతలు ఫిర్యాదులు చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తున్నారని.. వైసీపీ నేతల ఫిర్యాదులపై మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని మించిన వారు ఎవరూ లేరని.. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాటం ఆపేది లేదని అంబటి స్పష్టం చేయడం విశేషం.
టిడిపి పై విస్సుర్లు
తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) చెందిన ఐటీ విభాగం పై కూడా విమర్శలు చేశారు అంబటి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారానికి పాల్పడుతోందని.. సోషల్ మీడియాలో రాజకీయ శిష్టాచారానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐ టీడీపీ ద్వారా నడిచే పేజీలు ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విమర్శలు, చర్చలు ప్రజాస్వామ్యంలో సహజమే కానీ.. అవి గౌరవపూర్వకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత కామెంట్లు, అసత్య ప్రచారాలకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రధానంగా కిరాక్ ఆర్పి, సీమ రాజాలను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు అంబటి.