YCP Party Offices: వైసీపీకి స్వల్ప ఉపశమనం. ఆ పార్టీ కార్యాలయాలకు కూల్చివేత నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయాలు నిర్మించారంటూ కూల్చివేతకు దిగిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని యంత్రాలతో కూల్చివేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. దీనిపైన వైసిపి హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో నోటీసులు జారీ అయ్యాయి. అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ స్థలాల్లో నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ నిర్మాణాలు ఎందుకు తొలగించ కూడదో చెప్పాలని నోటీసులు సైతం ఇచ్చారు. వీటి పైన వైసిపి నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము నిబంధనలకు లోబడి మాత్రమే నిర్మాణాలు జరిపామని వైసీపీ స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేతలకు దిగారని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ కార్యాలయ భవనాల అనుమతులకు సంబంధించి రికార్డులు ఇవ్వాలని ఆ పార్టీ నేతలకు కోర్టు ఆదేశించింది. రెండు నెలల గడువు కూడా విధించింది. అదే సమయంలో వైసీపీకి తమ వాదనలు వినిపించేందుకు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. కూల్చివేత్తల విషయంలో చట్టం ప్రకారం వ్యవహరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేలా అవకాశం ఇవ్వాలని కోరింది. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే తప్ప.. కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు సూచించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. దీంతో వైసిపి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.