Kapu Ramachandra Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రమాదంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కీలక నేతలు సైతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి సవాళ్లు ఎదురు కావడంతో చాలామంది సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 50 మంది నాయకులు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారి తప్ప.. వచ్చినవారు లేకుండా పోతున్నారు. ఇటువంటి సమయంలో ఓ సీనియర్ నేత రీ ఎంట్రీ కి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!
* మొన్న ఆ మధ్యన శైలజనాథ్
మొన్న ఆ మధ్యన పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్( sailaja Naat) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ పొలిటిషియన్ గా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకోవైపు వివిధ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు సైతం తిరిగి ప్రయత్నిస్తున్నారు. అటువంటి నేతల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. ఆయన సైతం వైయస్సార్ కాంగ్రెస్ లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* టికెట్ నిరాకరించడంతో గుడ్ బై
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపు రామచంద్రారెడ్డి( Kapu Ramachandra Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి ముందే తేల్చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. బిజెపిలో చేరారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ పొలిటీషియన్ గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు గెలిచారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* కాంగ్రెస్ లో చేరేందుకు..
వాస్తవానికి షర్మిల( Sharmila) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నించారు. కానీ వీలుపడలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడంతో బిజెపిలోకి వెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వంలో కాపు రామచంద్రారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా రాయదుర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మెట్టు గోవిందరెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు. బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో క్యాడర్లో తీవ్ర నిరాశ ఉంది. అందుకే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.