Kesineni Nani Vs Kolikapudi Srinivasa Rao: రాజకీయాల్లో సులువుగా అవకాశాలు రావు. వస్తే మాత్రం అందిపుచ్చుకోవాలి. సద్వినియోగం చేసుకుంటేనే నాలుగు కాలాలపాటు రాజకీయాల్లో ఉండగలరు. దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం మూల్యం తప్పదు. అయితే ఒక్కోసారి రాజకీయాల్లో దూకుడు తప్పదు. కానీ వ్యూహానికి తగ్గట్టు దూకుడు ఉండాలి. వ్యవహారానికి మించి ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇప్పుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని( Kesineni Chinni ), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. టిడిపి ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సంచలన ఆరోపణలు చేశారు కొలికపూడి శ్రీనివాసరావు. దీంతో ఆ ఇద్దరు నాయకులను హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇద్దరు నేతలు తొలిసారిగా గెలిచిన వారే.
* నాని దూరం కావడంతో..
కేశినేని ట్రావెల్స్ అధినేతగా ఉన్న కేశినేని నానిని టిడిపిలోకి రప్పించారు చంద్రబాబు( CM Chandrababu). రాజకీయంగాను ఎంతగానో ప్రోత్సహించారు. రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు. 2014లో తొలిసారిగా గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. అయితే నాయకత్వం విషయంలో నాని వైఖరిలో మార్పు వచ్చింది. ప్రత్యామ్నాయంగా నాని సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్నిని తెచ్చారు. ఎంతగానో ప్రోత్సహించారు. ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. సామాజిక వర్గపరంగా బలమైన నియోజకవర్గం కావడంతో పాతుకు పోయేందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చారు. కానీ ఎందుకో చిన్ని అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనుకున్న మేర ఆయన పట్టు పెంచుకోలేకపోతున్నారు. నారా లోకేష్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు సైతం సానుకూలంగా ఉంటారు.
* నాని ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే టికెట్..
వాస్తవానికి అమరావతి( Amravati capital ) ఉద్యమ నేతగా ఉండేవారు కొలికపూడి శ్రీనివాసరావు. కేశినేని నాని పార్టీ నుంచి వెళ్లిపోవడంతో టిడిపి నాయకత్వం శివనాథ్ అలియాస్ చిన్నికి ఎంపీ టికెట్ ఖరారు చేసింది. ఆ సమయంలో కేశినేని చిన్ని పట్టు పట్టి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను కొలికపూడి శ్రీనివాసరావుకు ఇప్పించుకున్నారు. ఆయనను గెలిపించుకున్నారు. ఆ కృతజ్ఞత కొలికపుడిలో కనిపించింది కూడా. అయితే ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే కొలిక పూడి తన నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయలేకపోయారు. లేనిపోని వివాదాల్లో చిక్కుకున్నారు. అలా ఆయన పార్టీ క్యాడర్ తో పాటు హై కమాండ్ వద్ద కూడా పలుచన అయ్యారు.
* జవహర్ ను తేవడంతోనే..
అయితే అధిష్టానానికి దగ్గరగా ఉండి.. విజయవాడ ఎంపీగా ఉండడంతో.. తిరువూరు నియోజకవర్గాన్ని సరి చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించింది హై కమాండ్. అయితే అక్కడే ఎంపీ చిన్నపాటి తప్పులు చేశారు. అప్పటివరకు తన వెంట నడిచిన కొలిక పూడి శ్రీనివాసరావును పక్కనపెట్టి మాజీ మంత్రి జవహర్ ను తెరమీదకు తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో జవహర్ అభ్యర్థి అని ప్రచారం చేయడం ప్రారంభించారు. అది ఎంత మాత్రం కొలికపూడికి రుచించలేదు. అందుకే అప్పట్లో ఎన్నికల్లో జరిగిన ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టారు. కేశినేని చిన్నిని చులకన చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు హై కమాండ్ ఎదుట దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారి రాజకీయ అవసరాలు, టికెట్లపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.