Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారా? తిరిగి ఆయన టిడిపిలో చేరుతారా? ఆ వార్తల్లో నిజం ఎంత? నిజంగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. దీనిపై ఆయన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సైతం స్పందించారు. దీంతో నాని రీఎంట్రీ పై రకరకాల చర్చ నడుస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. ఓటమి ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే తరచూ ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని తెగ ప్రచారం నడుస్తోంది.
Also Read: నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!
* ఆ ఫ్యామిలీ నుంచి తొలి వ్యక్తి..
వాస్తవానికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్న కేశినేని కుటుంబం నుంచి నాని 2014 ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే విజయవాడ( Vijayawada) ఎంపీ అభ్యర్థిగా మారారు. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సైతం జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడ్డారు నాని. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి రెండోసారి గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి కృష్ణా జిల్లా టిడిపి నేతలతో విభేదాలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో టిడిపి నాయకత్వం కేశినేని నాని సోదరుడు శివనాథ్ ను ప్రోత్సహించడం ప్రారంభించింది. మొన్నటి ఎన్నికల్లో కేశినేని నాని పై ఆయన సోదరుడు శివనాథ్ గెలిచారు. వాస్తవానికి టిడిపి నాయకత్వం నాని విషయంలో ఎంతగానో వేచి చూసింది. కానీ నాని 2019- 2024 మధ్య నాయకత్వానికి తలనొప్పిగా మారారు. ముఖ్యంగా లోకేష్ నాయకత్వాన్ని విభేదించారు. అయితే ఇప్పుడు ఆయన టిడిపిలో రీఎంట్రీ కి అదే పెద్ద అవరోధంగా మారినట్లు తెలుస్తోంది.
* తొలిసారి గెలిచేసరికి సమన్వయం..
2014లో తొలిసారిగా ఎంపీ అయ్యారు కేశినేని నాని( Kesineni Nani). 2014 నుంచి 2019 మధ్య ఆయన పార్టీతో సమన్వయంతో ముందుకు సాగారు. అందరూ పార్టీ నాయకులను గౌరవించుతూ సమన్వయం చేసుకున్నారు. దీంతో ఎంపీగా కూడా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా సమర్ధించేవారు. చంద్రబాబు కూడా గౌరవం ఇచ్చేవారు. అయితే 2019 ఎన్నికల్లో నాని గెలిచేసరికి అది తన విజయం గా భావించారు ఆయన. అప్పటినుంచి ఆయన స్వరంలో మార్పు వచ్చింది. పార్టీ నేతలతో పాటు నాయకత్వాన్ని సైతం లెక్కచేయకుండా వ్యవహరించారు. ముఖ్యంగా స్థానిక నాయకులపై ఉన్న కోపంతో లోకేష్ నాయకత్వాన్ని సైతం ధిక్కరించారు. ఆయన పాదయాత్రను సైతం లెక్క చేయలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత చంద్రబాబుపై విమర్శలు చేశారు.
* ఆ బాధతోనే రాజకీయాలకు దూరం..
అయితే రెండోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) అధికారంలోకి వస్తుందని భావించి కేశినేని నాని ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. కానీ అక్కడ కూడా చుక్కెదురయింది. తనతో పాటు పార్టీ ఓడిపోవడంతో మైండ్ బ్లాక్ అయింది. అనవసరంగా టిడిపి నుంచి బయటకు రావడం తప్పైందని అర్థమైంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే కాదు రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఇప్పుడు టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. పార్టీ నాయకత్వాన్ని విభేదించిన వారికి ఎంట్రీ లేదని తేల్చేశారు. తద్వారా తన సోదరుడు టిడిపిలోకే కాదు కూటమిలో కూడా చేరే చాన్స్ లేదని తేల్చి చెప్పారు ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని.
Also Read: మందుబాబులకు షాక్.. రేపు వైన్ షాపులు బంద్!