Kendriya Vidyalayas: ఏపీకి ( Andhra Pradesh)గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు వంటివి ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఎనిమిది తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు నాలుగు, ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లకు ధన్యవాదాలు తెలిపారు.
* ఆ నాలుగు చోట్ల..
ఏపీకి సంబంధించి అమరావతి( Amravati capital), శ్రీకాకుళం జిల్లా పలాస, చిత్తూరు జిల్లా మంగసముద్రం, కుప్పంలోని వైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణకు సైతం నాలుగు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల కోసం రూ.5862 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
* డిఫెన్స్ ఉద్యోగుల హర్షం..
సాధారణంగా కేంద్రీయ విద్యాలయంలో( Central School) త్రివిధ దళాలకు చెందిన కుటుంబాల పిల్లలు ఎక్కువగా చదువుతుంటారు. వారికి అడ్మిషన్లు ఇస్తుంటారు. అయితే కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో.. డిఫెన్స్ ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటాయి. అవి అందుబాటులో ఉండే నగరాలు, పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్మీ, నావి, ఎయిర్ ఫోర్సు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.