CM KCR – AP BRS : ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నం కేసీఆర్ కి కలిసి రావడం లేదు. ఇలా బీఆర్ఎస్ ను విస్తరించారో లేదో.. ఏపీ నుంచి తెగ ఫోన్లు వచ్చాయని కేసీఆర్ ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం క్యూకడుతున్నారని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, తాడి శకుంతల వంటి తెలిసీ తెలియని నాయకులు చేరారు. వారితోనే పార్టీని నడిపిస్తున్నారు. చంద్రశేఖర్ కు ఏపీ బాధ్యతలు, కిశోర్ బాబుకు జాతీయస్థాయి బాధ్యతలు కట్టబెట్టి మమ అనిపించేశారు.
ఎంతో అనుకుంటే ఇంతే అన్న చందంగా మారడంతో ఏదో సీరియస్ ఇష్యూని తీసుకుంటే కానీ వర్కవుట్ కాదని కేసీఆర్ భావించారు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంటరయ్యారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఏపీలో బలపడిపోతామని బీఆర్ఎస్ నేతలు భ్రమ పడ్డారు. బీడ్ లు వేసి విశాఖ స్టీల్స్ ను కాపాడుకుంటామని ప్రకటనలు చేశారు. కానీ అది జరగలేదు. తిరిగి పెద్ద డ్యామేజీ జరిగిపోయింది. కృష్ణా జలాల వివాదంతో సొంత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో సహజంగా ఏపీకి వ్యతిరేకంగా మారిపోయారు.
ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ఏపీలో వర్కవుట్ కాకపోయేసరికి కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. మరోవైపు కర్నాటక దెబ్బతో కాంగ్రెస్ కు జవసత్వాలు వస్తున్నవేళ.. స్వరాష్ట్రంపై పూర్తిస్తాయిలో దృష్టిపెట్టాలని డిసైడయ్యారు. అంతవరకూ ఏపీలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించి వదిలేయ్యాలని నిర్ణయించుకున్నారు. గుంటూరులో ఏపీ రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత విజయవాడ లో ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ.. తగిన స్థలం కార్యాలయం రెండూ కూడా లభించలేదు. దీంతో గుంటూరు శివారులోని ఆటోనగర్లో ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది 5 అంతస్థు లతో కూడిన భవనం. ఈ భవనాన్ని ఈ నెల 21న విదియ తిథి నాడు ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టించారు.
బీఆర్ఎస్ విస్తరణ ప్రకటన తరువాత కేసీఆర్ ఏపీలో పర్యటిస్తారని చాలాసార్లు ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. విజయవాడలో కానీ.. విశాఖలో కానీ భారీ సభ ఏర్పాటుచేసి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ తలపోశారు. కానీ అదికూడా వర్కవుట్ కాలేదు. అందుకు అనుకూలతలు కుదరలేదు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభానికి రాకుంటే విమర్శలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ గుంటూరుకు వస్తారని ప్రగతి భవన్ వర్గాలతోపాటు.. ఏపీ బీఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.