Viral Video: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందింది. లక్షల మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు.
ఈసారి జాతరకు దాదాపు కోటికి పైగా భక్తులు వచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే భక్తులకు తగ్గట్టుగా ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెల వద్దకు చేరుకోవడంతో పూజా క్రతువులు దాదాపుగా పూర్తయ్యాయి.
మేడారం జాతర నేపథ్యంలో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ఒక వీడియో మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రూపొందించిన వీడియో నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు. కెసిఆర్, చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డి ఒకే ట్రాక్టర్ మీద ప్రయాణిస్తున్నారు. వారంతా కూడా మేకలు.. ఇతర సామాగ్రితో మేడారం జాతరకు వచ్చారు. అంతేకాదు గద్దెల వద్ద పూజలు చేశారు. అనంతరం మేకను కోసుకొని వంటలు చేస్తున్నారు. వంటలు పూర్తయిన తర్వాత సామూహికంగా భోజనాలు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇటీవలి కాలంలో ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. కెసిఆర్, రేవంత్ రెడ్డి, జగన్, చంద్రబాబు ఇలా కలుస్తారో లేదో తెలియదు.. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో మాత్రం ఆకట్టుకుంటున్నది. ఈ వీడియోను చూసిన వారంతా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.. ఇది నిజ జీవితంలో జరిగితే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం గా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, జగన్ ఇప్పుడు మళ్లీ అధికారం కోసం అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అధికార ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. భిన్న ధ్రువాలుగా ఉన్న ఈ నాయకులు కలిసిపోయి.. సామరస్యంగా ఇలా కొనసాగితే బాగుంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి వారు ఇలా సరదాగా ఉండాలని కోరుకుంటున్నారు.