KCR And Jagan: గెలుపులో మజా కంటే.. ఓటమిలో ఎదురయ్యే కష్టనష్టాలను అధిగమిస్తేనే నిజమైన శక్తిమంతుడు అవుతారు. ఓటమిని తట్టుకొని విజయతీరాలకు చేరిన వారే నిజమైన సారధి అనిపించుకుంటారు. అలా చాలాసార్లు అనిపించుకున్నారు చంద్రబాబు. 1995 టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు( CM Chandrababu) అధికారాన్ని హస్త గతం చేసుకున్నారు. అది మూన్నాళ్ళ ముచ్చట అని అంతా భావించారు. కానీ తన శక్తి యుక్తులతో, పనితీరుతో ప్రజలను ఒప్పించగలిగారు చంద్రబాబు. 1999లో ఆయన నాయకత్వంలోనే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రజల మద్దతు పొందినట్టు అయింది. అది మొదలు నేటి వరకు చంద్రబాబు ఎదుర్కొని రాజకీయం లేదు. అధిగమించని సంక్షోభాలు లేవు.
* ప్రజల మధ్యకు ఎప్పుడు?
అయితే చంద్రబాబుపై పంతం రాజకీయం చేసే కేసిఆర్ ( KCR) ఈ విషయంలో మాత్రం సరితూగడం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మధ్యకు రావడం లేదు. ప్రజా పోరాటాలు చేయడం లేదు. తెలంగాణలో సెంటిమెంట్ అనే ప్రయోగం చేసి తాను అనుకున్న రాజకీయం చేయగలిగారు కేసీఆర్. చంద్రబాబు అనే బూచిని చూపి ఇంతకాలం రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు కుదరని పని. అలాగని చంద్రబాబులా సమర్థవంతంగా ప్రజల్లోకి వచ్చి పనిచేయలేకపోతున్నారు. సొంత రాష్ట్రంలో సొంత పార్టీ శ్రేణుల నమ్మకాన్ని సైతం కోల్పోతున్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాలు చేశారని చెప్పి.. తాను కూడా ఢిల్లీ బాట పట్టారు. అయితే ప్రజలు దీనిని హర్షించలేదు. సొంత రాష్ట్రంలోనే దెబ్బతీశారు.
* చంద్రబాబు అరెస్టుతో రాక్షసానందం..
అంతులేని విజయ గర్వంతో చంద్రబాబును అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఏపీలో చంద్రబాబు అరెస్టు అయితే హైదరాబాదులో నిరసనలు చేపట్టడం ఏంటి అని అడ్డుకున్నారు కేటీఆర్. కానీ ఎల్లకాలం నిజాలు దాయలేరు. అదేపనిగా సెంటిమెంట్ అస్త్రం పండదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిని గుర్తించారు. ఆ ఇద్దరు నేతల కపట స్నేహాన్ని, తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఆడుకున్న రాజకీయాన్ని గుర్తించి.. రెండు పార్టీలను ఓడించారు. అయితే చంద్రబాబుపై ఉన్న పంతం వారితో ఇంత పని చేయించింది. అయితే ఓటమి నుంచి విజయతీరాలకు చేరే క్రమంలో చంద్రబాబు చేసిన ప్రయత్నాలను సైతం వారు అనుసరించడం లేదు. అక్కడ కూడా వారు చంద్రబాబును ప్రత్యర్థిగానే చూస్తున్నారు. అందుకే కాబోలు ప్రజల్లోకి రావడం లేదు. ఎన్నికల్లో చివరి ఏడాది చూసుకుందాంలే అన్నట్టు వారి పరిస్థితి ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం ప్రజలు తెలివైన వారు. తప్పకుండా వారికి వాస్తవాలు తెలుస్తాయి. వారిని ఎల్లకాలం మోసం చేయలేరు కూడా. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది.
* రాజకీయ వ్యూహాలు అవసరం..
ప్రత్యర్థి పై పంతం మాత్రమే కాదు. ప్రత్యర్థి అనుసరించే రాజకీయ వ్యూహాలను సైతం గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఈ విషయంలో నిత్య విద్యార్థి. జగన్మోహన్ రెడ్డి మాదిరిలా ఆయన ప్రారంభం నుంచి శాసనసభను బహిష్కరించలేదు. 23 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో హుందాగా అడుగుపెట్టారు. స్పీకర్ తమ్మినేని ఎన్నిక సమయంలో సైతం చాలా హుందాగా.. అసలు తాను ఓడిపోయానని బాధ కూడా బయటకు వ్యక్తం చేయకుండా ఉన్నారంటే ఆయనలో మంచితనాన్ని గుర్తించాలి. ఆపై రాజకీయ చతురతను గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక సెంటిమెంటు సన్నగిల్లింది. ఏపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సానుభూతి సైతం తగ్గింది. అయితే ఎల్లప్పుడూ సెంటిమెంట్ అస్త్రాలను మాత్రమే కాదు.. పనితీరును ప్రజలు కొలమానంగా చూస్తారు. అయితే ప్రజల మధ్యకు వెళ్లకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కేసీఆర్ జాగ్రత్త పడకపోతే మూల్యం తప్పదు.