https://oktelugu.com/

Godavari Districts : జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు.. కానీ గోదారోళ్ల కార్తీక విస్తరి చూస్తే .. పొట్టలో స్థలం ఉండదు..

మిగతా భారతదేశం సంగతి ఎలా ఉన్నా.. తెలుగు నెల విషయానికి వచ్చేసరికి సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. సంప్రదాయం ఆమోఘంగా దర్శనమిస్తుంది. ఈ సంప్రదాయాన్ని పాటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల వారి శైలి వేరే విధంగా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వారు పాటించే ప్రతి విధానం అద్భుతంగా ఉంటుంది.

Written By: Rocky, Updated On : November 18, 2024 11:13 am
karthika masam special foods

karthika masam special foods

Follow us on

Godavari Districts : గోదావరి జిల్లాలో కార్తీక మాసం పేరు చెప్పగానే ఆధ్యాత్మిక భావన కళ్ళ ముందు స్పష్టంగా దర్శనమిస్తుంది. కార్తీక మాసం రోజుల్లో గోదావరి జిల్లాల ప్రజలు ఉసిరి చెట్టుకు పూజలు చేస్తుంటారు. నిష్టగా దీపారాధన జరుపుతుంటారు. మామిడి తోటల్లో వనభోజనాలకు ఇంటిల్లిపాది వెళ్తుంటారు. ఇవి కుల భోజనాలుగా మారిపోయాయని ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆ భోజనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ భోజనాలలో విభిన్నమైన వంటకాలను తయారు చేస్తారు. ఉసిరి చెట్టుకు పూజలు చేసి.. పరమేశ్వరుడికి దీపారాధన చేసిన తర్వాత.. పచ్చని చెట్ల మధ్య.. పచ్చని అరిటాకులను పరిచి.. ఒక్కో పదార్థాన్ని వడ్డిస్తూ ఉంటే.. నోరూరుతుంది. నేతి బొబ్బట్లతో భోజనాల క్రతువు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బెల్లంతో తయారుచేసిన బూరి కారం, వాము, చల్ల మిశ్రమం తయారుచేసిన మిరపకాయ బజ్జీలు వడ్డిస్తారు. ఆ తర్వాత చింతపండు వేసి కలిపిన పులిహోర.. ఘుమఘుమమలాడే కొబ్బరి అన్నం.. కొత్తిమీర రైస్.. దోసకాయ పచ్చడి.. పచ్చిమిరపకాయ పచ్చడి.. మామిడి, పచ్చి కొబ్బరి మిశ్రమంతో తయారుచేసిన పచ్చడి.. వేడివేడి పలావు.. వైట్ రైస్.. కందిపొడి.. కరివేపాకు.. వాటిపై నెయ్యి ఇలా.. పచ్చని అరిటాకు నిండా వంటకాలు పెడతారు. ఈ పదార్థాల మొత్తం చూసిన తర్వాత నాలుక శివతాండవం చేస్తుంది. అన్నింటిని ఒక పట్టు పడుతుంది..

కూరలు కూడా

పచ్చటి అరటాకులో ఇవి మాత్రమే కాకుండా కంద బచ్చలి కూర, పనసపొట్టు వేపుడు, అన్ని కూరగాయల మిశ్రమంతో తయారుచేసిన సాంబార్, వెల్లుల్లి, ఇతర మిశ్రమాలతో తయారు చేసిన రసం, కారం, ఉప్పు మిశ్రమంలో అప్పడం, వీటిల్లో పప్పు కూడా వేస్తారు. చివరగా ముక్కల వడియాలు, మజ్జిగ పులుసు.. అప్పుడే బయటికి తీసిన అనంత పెరుగు.. చివరన మాగిన అరటిపండు వడ్డించి కార్తిక వన భోజనాల క్రతువు ముగిస్తారు. భోజనాలు పూర్తయిన తర్వాత అద్భుతమైన కలకత్తా తమలపాకుతో తాంబూలం ఇచ్చేస్తారు. అందువల్లే గోదావరి జిల్లాల్లో కార్తీక వనమాస భోజనాలు భిన్నంగా ఉంటాయి. మిగతా ప్రాంతాలలో వనభోజనాలు జరిగే తీరు తక్కువని కాదు. కాకపోతే గోదావరి జిల్లాలో భారీగా సాగుతుంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక పెళ్లికి మించిన స్థాయిలో వన భోజనాలకు ఖర్చు చేస్తారు. ఆప్యాయతలు.. ముచ్చట్లు.. కార్తీక మాస ప్రాశస్త్యం.. ఇలా అన్ని చెప్పుకుంటూ వనమంతా జనం లాగా మారిపోయి వనభోజనాల సంప్రదాయాన్ని అద్భుతంగా ముగిస్తారు. నిత్య జీవితంలో.. పని ఒత్తిడి నుంచి సాంత్వన పొదుతారు. కార్తీకమాసాన్ని ఆధ్యాత్మిక సౌరభంగా జరుపుకుంటారు.