Pawan Kalyan: తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. పవన్ 32 సీట్లు అడిగారని వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన అభిమాన వర్గాల ఆశలు తలకిందులు అయ్యాయి. మరోవైపు చేగొండి హరి రామ జోగయ్య లేఖ కలకలం సృష్టిస్తోంది. పవర్ షేరింగ్ అత్యవసరమంటూ చేసిన హెచ్చరిక కాపుల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకమునుపే టిడిపి అనుకూల మీడియా చేస్తున్న అతి ప్రచారంపై కాపులు మండిపడుతున్నారు.
కాపులకు ఒక్కసారైనా రాజ్యాధికారం దక్కాలని ఆ సామాజిక వర్గం ఎదురుచూస్తోంది. అది పవన్ ద్వారా సాధ్యమవుతుందని బలంగా నమ్ముతోంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లలో జనసేన పోటీ చేయాలని సగటు కాపు సామాజిక వర్గానికి చెందిన అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పవన్ సీట్ల బేరం 32 తో ప్రారంభమైందని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. సహజంగానే కాపులకు ఇది రుచించని విషయం. ఇప్పటికే పవన్ పొత్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించడంతో చాలామంది మీడియాకు ఎక్కడం లేదు. కానీ లోలోపల రగిలిపోతున్నారు. వాస్తవానికి పవన్ కు 50కు పైగా అసెంబ్లీ, 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు ఇస్తారని అంతా భావించారు. అటు పవన్ వైఖరిలో సైతం ఇటీవల మార్పు వచ్చింది. మెజారిటీ స్థానాలు ఆయన డిమాండ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ 32 సీట్లతో బేరం ప్రారంభించారని టిడిపి అనుకూల మీడియా ప్రకటించడంపై కాపులు ఆగ్రహంగా ఉన్నారు.
మరోవైపు కాపు సేవా సమితి ప్రతినిధి చేగొండి హరి రామ జోగయ్య పవన్ కు లేఖాస్త్రం సంధించారు. అంత తక్కువ స్థానాలతో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పొత్తులో సింహభాగం ప్రయోజనాలు జనసేనకు దక్కాల్సిందేనని తేల్చి చెప్పారు.పవన్ చర్యలకు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని సంకేతాలు పంపారు. అయితే చాలామంది కాపు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు వేరే ఆప్షన్ లేదు. ఒంటరి పోరు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసిపికి భారీ లబ్ధి చేకూరుతుంది. అదే జరిగితే జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. అందుకే పొత్తుల విషయంలో ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో అధికార పక్షం తో పాటు ఆ పార్టీకి అనుకూల వర్గాలు కుట్రలు చేస్తాయని తెలుసు. అందుకే పవన్ ఈ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సీట్ల కేటాయింపు విషయంలో పవన్ సరిగ్గా వ్యవహరించడం లేదని.. మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తే టిడిపి తప్పకుండా ఇస్తుందని భావిస్తున్నారు. అయితే బలమైన స్థానాలను మాత్రమే తీసుకుని పోటీ చేసి గెలవాలని.. బలం లేని చోట ఎందుకని పవన్ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు.
వైసిపి తో పాటు తెలుగుదేశం పార్టీ బీసీల జపం పఠిస్తోంది. వైసిపికి రెడ్డి, టిడిపికి కమ్మ ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు జనసేన వైపు మళ్ళింది. గత ఎన్నికల్లో వివిధ కారణాలతో కాపు ఓటు బ్యాంకు చీలింది. ఈసారి మాత్రం ఏకపక్షంగా జనసేన వైపు ఉంది. కానీ మెజారిటీ కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటుంది. కానీ పవన్ తక్కువ సీట్లతో.. పవర్ షేరింగ్ సాధ్యం కాదని అనుమానిస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అటు టిడిపి అనుకూల మీడియా చేస్తున్న అతి, అగ్నికి ఆజ్యం పోసేలా వైసిపి సోషల్ మీడియా ఒక రకమైన అయోమయాన్ని సృష్టిస్తోంది. దీంతో కాపుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాపు ఓటు బ్యాంకు విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నాలు పెరుగుతున్నాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఎలా అధిగమిస్తారో చూడాలి. పవన్ వెంట నడుస్తుందన్న కాపు సామాజిక వర్గంలో చీలికకు జరుగుతున్న ప్రయత్నాలను.. పవన్ అడ్డుకట్ట వేయకపోతే మొదటి ప్రభావం జనసేనదే. తరువాత సరైన ఓట్ల బదులాయింపు జరగక.. కూటమి లక్ష్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. దీనిపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.