AP Cabinet meeting
AP Cabinet : ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధపడుతున్నారా? కొత్తగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నారా? అదే జరిగితే మంత్రివర్గం నుంచి తొలగింపు ఎవరికి? అసలు ఈ ప్రచారంలో నిజం ఉందా? అన్నదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు సమీపిస్తోంది.మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన సమయం పూర్తయింది. కానీ కొంతమంది మంత్రుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో ఒకరిద్దరిని మార్చి కొత్త వారిని తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే తొలగించేదెవరికి? కొత్తవారు ఎవరు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దానిని జనసేన నేత నాగబాబుతో భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు.
* అందరి దృష్టి విజయనగరం వైపే
అయితే తొలగించే వారి విషయంలో అందరి వేళ్ళు విజయనగరం వైపే చూపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాసును తొలగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.ఆయన రాజకీయాలకు కొత్త. ఆయన స్వయాన మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడుకు మనవడు. ఉన్నత చదువులు చదివి..మంచి కొలువులో ఉన్న ఆయనను తీసుకొచ్చి గజపతినగరం అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ టికెట్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య పై గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనూహ్యంగా మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. రాజకీయాలకు కొత్త అయిన శ్రీనివాస్ విజయనగరం జిల్లా కొత్తగా దూకుడు కనబరచలేకపోతున్నారు అన్న విమర్శ ఆయనపై ఉంది. అందుకే ఆయనను మార్చుతారని తెగ ప్రచారం నడుస్తోంది.
* పల్లాకు తప్పకుండా చాన్స్
అయితే కొత్తగా టిడిపి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. ఉభయగోదావరి తో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులకు సైతం ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. రాయలసీమ నుంచి తొలగించిన మంత్రి స్థానంలో.. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది. గోదావరి జిల్లాల మంత్రి స్థానంలో పల్లా శ్రీనివాస్ కు పదవి ఇస్తారని ప్రచారం ఉంది. విజయనగరంలో కొండపల్లి శ్రీనివాస్ బదులు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.
* మోస్ట్ సీనియర్ లీడర్
వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో కళా వెంకట్రావు మోస్ట్ సీనియర్ లీడర్. 2014లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తొలి విడతగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా చాన్స్ ఇచ్చారు. విస్తరణలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లి వచ్చారు కళా వెంకట్రావు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పై గెలిచారు. దీంతో కళా వెంకట్రావుకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ యువకుడైన కొండపల్లి శ్రీనివాస్ కు అవకాశం దక్కింది. ఒకవేళ శ్రీనివాసును తప్పించి విజయనగరం జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటే.. కళా వెంకట్రావు ఖరారు చేస్తారని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.