Chandrababu Naidu – Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో మాయని గాయం తగిలింది. అందుకే ఆయన తాత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు తరుఫున పిలిచినా కూడా హాజరుకాకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. బాలయ్యలా తల ఊపడానికి.. హరికృష్ణలా బెండ్ కావడానికి ఎన్టీఆర్ సామాన్యుడు కాదని.. అన్నీ తెలిసిన రాజకీయ కుట్రలను పసిగట్టగల నేర్పరి అని తెలుస్తోంది. అందుకే సొంత తాత శతజయంతికి కూడా హాజరుకాలేదు. ఎందుకంటే అది చేస్తుంది చంద్రబాబు కాబట్టి..
నిజానికి సినిమా అయినా.. ఫ్యాన్స్ మీటింగ్ అయినా.. కార్యక్రమం ఏదైనా తాతను తలుచుకోకుండా మాట కూడా మాట్లాడరు తారక్. అలాంటిది తాత పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీస్తోంది. టీడీపీ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుతో.. ఎన్టీఆర్ హర్ట్ అయ్యారా? అలకపాన్పు ఎక్కారా? కావాలని ఈ వేడుకలకు హాజరుకాలేదా? ఫ్యామిలీ ట్రిప్ పేరుతో కావాలని దూరంగా ఉన్నారా? అనే చర్చ నందమూరి అభిమానులతో పాటు రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తోంది. అన్నీ అర్ధం చేసుకున్నాకే తారక్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
పేరుకే ఇది శతజయంతి వేడుకల ఈవెంట్ కానీ.. దీని వెనుక చంద్రబాబు స్కెచ్ ఉందని ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ కానీ జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే చంద్రబాబుతో కలసి వేదిక మీద కనిపించాలి. దీంతో కచ్చితంగా సమీకరణలు మారుతాయి. తరువాత జరిగే మహానాడుకు ఆహ్వానిస్తారు. అక్కడకు వస్తే ఎన్నికల ప్రచారానికి కమిట్ చేస్తారు. ఇవన్నీ లెక్క వేసుకునే తారక్ గైర్హాజరుకు మొగ్గుచూపి ఉంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అటు ఈవెంట్ లో అతిథుల ప్రసంగాలు కూడా అలానే ఉన్నాయి.
బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ, పురందేశ్వరి, సీతారాం ఏచూరి, రాజా వంటి పెద్దపెద్ద నాయకులు వచ్చారు. సినీ, రాజకీయరంగ ప్రముఖులు విచ్చేశారు. వారంతా మాట్లాడే సమయంలో ఎక్కవ శాతం చంద్రబాబుకే కేటాయించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడింది తక్కువ. ఒక వేళ తారక్ హాజరై ఉంటే తప్పనిసరిగా చంద్రబాబు గురించి మాట్లాడాలి. లేకుంటే రకరకాలైన చర్చలకు దారితీస్తుంది. ఒక వేళ చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడితే మొన్న రజనీకాంత్ మాదిరిగా విమర్శలు ఎదుర్కొనేందుకు చాన్స్ ఉండేది. ఈ పరిస్థితి ముందే గ్రహించి గైర్హాజరై ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్‌కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చంద్రబాబును పక్కన పెడితే.. తారక్ ఎన్ని రకాలుగా బాలకృష్ణకు దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నా.. అటు వైపు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదని టాక్. తారకరత్న కార్యక్రమంలోనూ ఎన్టీఆర్‌ను, కల్యాణ్‌రామ్‌ను బాలకృష్ణ పట్టించుకోనట్టు కనిపించారు. అదే కారణంతోనే కళ్యాణ్ రామ్ సైతం ముఖం చాటేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడేమో ఫ్యామిలీ ట్రిప్ పేరుతో ఎన్టీఆర్ వేడుకలకు తారక్ దూరం అయ్యాడు. దీంతో ఈ దూరం తగ్గేది ఎప్పుడు.. దగ్గరయ్యేది ఎప్పుడు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.