Journalists: ఏ ఉద్యోగమైనా సరే ఉన్నతిని కలిగించాలి. ఆర్థిక భరోసాన్ని పెంచాలి. భవిష్యత్తు మీద నమ్మకం కలిగించాలి. అలాకాకుండా ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు.. ఎప్పుడు బయటికి పంపిస్తారో తెలియదు.. ప్రతి ఏడాది వేతనంలో పెంపుదల ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎక్కడికి బదిలీ చేస్తారో తెలియదు.. ఇలాంటి సవాళ్లు ఉంటే ఎవరు చేస్తారు..ఎవరూ చేయరు. బయట ఎన్నో సవాళ్ళు ఉండొచ్చు. ఉద్యోగాలు లభించకపోతూ ఉండొచ్చు.. కానీ ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. వచ్చే అవకాశం కూడా లేదు.
రాజీనామా చేస్తున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ప్రచురితమవుతున్న ఓ ప్రముఖ పత్రికలో ఉద్యోగ నోటిఫికేషన్ పడింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ పేరుతో ఆ ప్రకటన వేశారు. ఆ పత్రికలో పనిచేయడానికి సబ్ ఎడిటర్లు కావాలట.. అది ప్రముఖ పత్రిక. అయినప్పటికీ డెస్క్ లో పనిచేయడానికి ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగ భద్రత లేదు. వేతనాల పెంపుదల ఆశించిన స్థాయిలో లేదు. రెండు రాష్ట్రాలలో అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. ఆ మేనేజ్మెంట్ అనుకూలమైన స్థాయిలో వేతనాలు పెంచకపోవడం పట్ల ముఖ్యంగా డెస్క్ లలో పనిచేసే ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. ఇప్పటికే దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల యూనిట్లలో సబ్ ఎడిటర్లు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ పరిణామం మేనేజ్మెంట్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే స్థాయిలో ఆందోళన కూడా కలిగించింది. ఇదే విషయాన్ని అదే సంస్థలో పనిచేస్తున్న పెద్ద తలకాయలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువచ్చాయి. వేతనాల పెంపుదల అనివార్యమని పేర్కొన్నాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు.. పోటీపత్రికల్లో ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయని చెప్పినప్పటికీ మేనేజ్మెంట్ వినిపించుకోలేదు. దీంతో కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగుల్లో నమ్మకం సడలిపోవడంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.
ఆ మేనేజ్మెంట్ ను నమ్మడానికి లేదు
ఇప్పటికే దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లా కేంద్రంలో ఏకంగా ముగ్గురు ఎడిటర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో దాదాపు ఆరుగురు సబ్ ఎడిటర్లు ఉద్యోగాలకు ఉద్వాసన పలికారు. అయితే వీరిలో చాలామంది సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవడం లేదా ఇతర సంస్థల్లో చేరిపోయారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో ఆ మేనేజ్మెంట్ అత్యంత మూర్ఖంగా వ్యవహరించింది. డెస్క్ లలో పనిచేసే ఉద్యోగులను దారుణంగా తొలగించింది. అసలే విపత్కర పరిస్థితులు ఉంటే.. ఉద్యోగుల జీవితాలతో మేనేజ్మెంట్ ఆడుకుంది. ఉన్న ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే ఇచ్చింది. కొంతమందితో బలవంతంగా సెలవులు తీసుకునేలా చేసింది. ఇప్పుడేమో డెస్క్ లలో పని చేయడానికి ప్రకటనలు ఇస్తోంది. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని.. ఇప్పుడేమో ఖాళీలు ఉన్నాయి అంటూ ఆ సంస్థ ప్రకటన చేయడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. అంతేకాదు నయవంచనకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ సంస్థ.. ఎన్నడూ ఉద్యోగుల్లో భరోసా నింపదని పేర్కొంటున్నారు.