Journalist Job Crisis: ఈ ప్రపంచంలో అత్యంత దిక్కుమాలిన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది జర్నలిస్టు ఉద్యోగమే. చెప్పుకోడానికి హోదా బాగానే ఉంటుంది. చెప్పుకునే స్థాయిలోనే జీతాలు ఉండవు. పై స్థాయిలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ.. కింది స్థాయిలో ఉండేవారికి నరకం కనిపిస్తుంది. సొసైటీలో నమస్తేలు పెట్టేవారు చాలామంది ఉంటారు. కానీ ఆ నమస్తే లతో కడుపునిండదు కదా.. అంతంత మాత్రం జీతాలతో జీవితాన్ని నెట్టుకు రాలేక.. ఏం చేయాలో తెలియక చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే కన్నుమూస్తుంటారు. ఇటీవల కాలంలో ఒక వరంగల్ జిల్లాలోని నలుగురు పాత్రికేయులు గుండెపోట్లతో చనిపోయారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటిదాకా గొడ్డు చాకిరీ చేయించుకున్న యాజమాన్యాలు పట్టించుకోవు. కనీసం రూపాయి కూడా ఇవ్వవు. ఫలితంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటాయి.
Also Read: Kota Vinutha Offer: ప్రాణం ఖరీదు ₹30 లక్షలు.. ఆఫర్ చేసిన కోట వినూత
తెలుగులో మీడియా సంస్థలు ప్రఖ్యాతంగా వెలుగుతున్నప్పటికీ.. అందులో పని చేస్తున్న పాత్రికేయుల జీవితాలు అమావాస్య చీకటిలాగా దర్శనమిస్తున్నాయి. కేవలం పై స్థాయి వ్యక్తులు ఒకరిద్దరు తప్ప.. మిగతా వారంతా దినదిన గండంగా బతుకుతున్న వారే. కుటుంబాలను త్యాగం చేయాలి. బంధాలను త్యాగం చేయాలి. అవసరాలను కూడా త్యాగం చేయాలి. ఇంత త్యాగం చేసినా జర్నలిస్ట్ కు ఒరిగేది ఏమీ ఉండదు. చివరికి వెనకేసుకునేది కూడా ఏదీ ఉండదు. చెప్పుకోవడానికి పేరు తప్ప. ఇంతటి దారుణమైన స్థితిలోనూ.. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ కొన్ని మీడియా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి. కాబోయే జర్నలిస్టులకు ఆహ్వానం అంటూ బాండెడ్ చాకిరికి నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. ఇది ఎంత దారుణం అంటే.. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎదుగూ బొదుగూ లేదు. సంవత్సరాలు సంవత్సరాలు పనిచేస్తున్న చెప్పుకున్న జీతాలు లేకపోవడం.. చెప్పుకునే హోదా లేకపోవడంతో ఇప్పటికే చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారు. ఆ బాటలో ఇంకా చాలామంది ఉన్నారు.. అయినప్పటికీ ఆ మేనేజ్మెంట్ కు వాస్తవ పరిస్థితి అర్థం కావడం లేదు..
Also Read: Vallabhaneni Vamsi jail case: వల్లభనేని వంశీకి మళ్లీ జైలు భయం!
సంవత్సరాలకు సంవత్సరాలు నమ్ముకుని పనిచేస్తున్న ఉద్యోగులకు గొప్పగా జీతాలు ఇవ్వడం చేతకాదు కానీ.. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. పైగా సమాజసేవ చేద్దాం రండి అంటూ పిలుపునిస్తోంది. సమాజసేవ అంటే బాండెడ్ చాకిరీనా.. నమ్ముకున్న ఉద్యోగులకు సరైన స్థాయిలో జీతాలు ఇవ్వకపోవడమా? నమ్ముకున్న ఉద్యోగులకు ఏ స్థాయిలో హోదాలు కల్పించారు? వారికి ఏ స్థాయిలో భరోసా ఇచ్చారు? అంతటి కరోనా వచ్చినప్పుడు ఉద్యోగుల జీతాలను అడ్డగోలుగా కోశారు కదా.. అడ్డగోలుగా నడి బజార్లో బయటపడేశారు కదా.. అప్పుడు గుర్తుకురాలేదా సమాజ సేవ.. అప్పుడు గుర్తుకు రాలేదా వారు పాత్రికేయులు అని.. ఇప్పుడు కొత్తగా ఈ నినాదాలు ఎందుకు.. అంటే ఉద్యోగులు బయటికి వెళ్లిపోతున్నారు కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో బండెడు చాకిరీ చేయడానికి బానిసలు కావాలి కాబట్టి.. దానికి జర్నలిస్ట్ అని పేరు పెడుతున్నారా.. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ఆధారంగా చాలామంది దరఖాస్తు చేయవచ్చు. కాబోయే జర్నలిస్టులమని గొప్పగా ఫీల్ కావచ్చు. కానీ వారందరికీ చెప్పేది ఒకటే.. బయటికి చెప్పేంత గొప్పగా ఇది ఉండదు. గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏదీ ఉండదు. అంతా బభ్రజమానం భజగోవిందం!