Jogi Ramesh on Fake Liquor Case: ఎవరైనా తప్పు చేయకపోతే నిశ్చింతగా ఉంటారు. తమ తప్పు లేదనుకుంటే దాని గురించి మాట్లాడరు. అయితే ఒకవేళ తప్పు చేసి దొరికిపోతామన్న వారు మాత్రం సందడి చేస్తుంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. నకిలీ మద్యం కుంభకోణంలో అసలు నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావించిన నాటి నుంచి ఆయన చేస్తున్న హడావిడి అంతా కాదు. జోగి రమేష్ ప్రోత్సాహంతోనే తాము కల్తీ మద్యం తయారు చేసినట్లు అద్దేపల్లి జనార్దన్ రావు స్పష్టం చేశారు. కానీ తనకు ఆయన ఎవరో తెలియదని బుకాయించారు జోగి రమేష్. కానీ అదే జనార్దన్ రావుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఒక్కొక్కటి బయటకు రావడంతో జోగి రమేష్ లో ఆందోళన ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు దేవుడి ఎదుట ప్రమాణాలతో బయటపడేందుకు జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారు.
అంతా పక్కా ప్లాన్ తోనే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా( Chittoor district) తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నేతృత్వంలోనే ఎక్సైజ్ శాఖ అక్కడ డంపును పట్టుకుంది. దాంతో తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్కు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే హై కమాండ్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ మరుసటి రోజు ఇబ్రహీంపట్నంలో సాక్షి మీడియా వేదికగా చేసుకుని నకిలీ మద్యం డంపును బయట ప్రపంచానికి చూపించారు జోగి రమేష్. అయితే అదంతా ఒక వ్యూహం ప్రకారం చేసిందంటూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు బయట పెట్టడంతో ట్విస్ట్ మొదలైంది. అప్పటినుంచి జోగి రమేష్ హడావిడి ప్రారంభం అయింది.
తెలియదంటూ హడావిడి..
అయితే తనకు సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అని జోగి రమేష్( Jogi Ramesh) మరిచిపోయారు. తిరిగి ఆయన ఎవరు అంటూ ప్రశ్నించారు. తంబళ్లపల్లె కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు డంపు బయటపడే సరికి ఆఫ్రికాలో ఉన్నారు. అయితే తన పేరు బయట పెట్టడాన్ని సహించుకోలేక ఆయన తనకు తాను లొంగిపోయేందుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కల్తీ మద్యం తనతో తయారు చేయించి.. ఇప్పుడు వారు పక్కకు తప్పుకొని తనను కేసుల్లో ఇరికించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనార్దన్ రావు. ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. వైసీపీ హయాంలో జోగి రమేష్ ప్రోత్సాహంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఇప్పుడు కూడా తంబళ్లపల్లెలో మద్యం తయారు చేయించి.. చంద్రబాబుతో పాటు లోకేష్ కు చెడ్డ పేరు తేవాలన్నదే ప్లాన్ అని బయటకు వెల్లడించారు అద్దేపల్లి జనార్దన్ రావు.
దుర్గమ్మ వద్ద ప్రమాణం..
అయితే ఈ కేసులో ఇప్పుడు ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేష్ మారిపోయే అవకాశం ఉంది. అప్పటి నుంచి తనకు ఆ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తెలియదు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ అద్దేపల్లి జనార్దన్ రావు మనవాడే అని స్వయంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు.. చాలా సందర్భాల్లో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అయినా సరే తనకు జనార్దన్ రావు తో సంబంధం లేదని.. దుర్గామాత వద్ద ప్రమాణం చేస్తానని చెప్పి ఈరోజు విజయవాడ వచ్చారు. తనకు సంబంధం లేదని ప్రమాణం చేశారు. తన సవాల్ ను చంద్రబాబు, లోకేష్ స్వీకరించలేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రను పోలీసులు పూర్తిస్థాయిలో అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. తన అరెస్టు తప్పదన్న భయంతోనే జోగి రమేష్ ఇలా ప్రమాణాల పాటు పట్టినట్లు ప్రచారం సాగుతోంది.