JC Diwakar Reddy: రాయల తెలంగాణ.. రాష్ట్ర విభజన నాటి నుంచి వినిపిస్తున్న మాట. విభజన సమయంలో రాయలసీమ నేతలు బలంగా ఈ డిమాండ్ ను వినిపించినా.. వారి మొరను ఎవరూ ఆలకించలేదు. మధ్యలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వచ్చినా దానిని కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. అయితే మున్ముందు ప్రత్యేక రాయలసీమ వాదన తెరపైకి వచ్చే చాన్స్ మాత్రం ఉంది. ఆంధ్రాతో రాయలసీమ కలవడం వల్ల సీమకు నీటి కష్టాలు తీరడం లేదు. అదే తెలంగాణతో ఉంటే ఈ పాటికే అన్నిరకాల సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరికేది. కానీ ఇప్పుడు సీమకు తెలంగాణ నుంచి అన్నిరకాల సమస్యలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సీమకు చెందిన సీఎం జగన్ ఆశించిన మేరకు పనిచేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటువంటి సమయంలో రాయలసీమకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తాజాగా అదే రకమైన డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణలో కలిపితేనే న్యాయం జరుగుతందని కుండబద్దలుకొట్టి మరీ చెబుతున్నారు.
వ్యూహాత్మకమా?
ఆది నుంచి రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపిన దివాకర్ రెడ్డి..ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తేవడం వ్యూహాత్మకమా లేకుంటే సాధారణ వ్యాఖ్య అన్నది తెలియడం లేదు. జగన్ సీఎం అవ్వడంతో సీమ కష్టాలు తీరుతాయని అంతా భావించారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. పైగా దగ్గరగా ఉన్న అమరావతి రాజధానిని దూరం చేసి విశాఖకు జై కొట్టారు. దీంతో సీమ ప్రజల్లో సైతం ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కానీ వైసీపీ ఓటమి చవిచూస్తే మాత్రం ఆ పార్టీ ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తెరపైకి తెచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అందుకే జేసీ దివాకర్ రెడ్డి నోట రాయల తెలంగాణ మాట వినిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ సాహసం చేసేది ఎవరు?
రాయలసీమను కలుపుకోవడానికి తెలంగాణకు ఎటువంటి అభ్యంతరం ఉండదని జేసీ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీ నుంచి విడగొడితే కదా తెలంగాణలో కలిసేది. అటువంటి సాహసం ఎవరు చేస్తారన్నది ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం దివాకర్ రెడ్డి యాక్టివ్ రాజకీయాల్లో లేరు. కానీ ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఉన్నారు. సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి టీడీపీలో కీరోల్ ప్లే చేస్తున్నారు. వయోభారంతో బాధపడుతున్న దివాకర్ రెడ్డి సలహాలకే పరిమితమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జేసీ ఫ్యామిలీకి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వనున్నారన్న ప్రచారం ఉంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఎటువంటి చిక్కుముళ్లు ఎదురుకాకుండా జేసీ రాయల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు.
అదో సజీవ అంశంగా..
అయితే ప్రత్యేక రాయలసీమ వాదాన్ని సజీవంగా ఉంచేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందులో వైసీపీ నేతలు సైతం ఉన్నారు. కర్నాటకలోని బళ్లారి ప్రాంతాన్ని కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కొంతమంది ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ సైతం చేశారు. మొన్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుంటే ఉద్యమం పట్టాలెక్కేది అన్న టాక్ ఉంది. అయితే జగన్ అధికారంలోకి రావడంతో ప్రత్యేక రాయలసీమ వాదాన్ని పక్కనపడేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి చవిచూస్తే మాత్రం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పక్కా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో జేసీ వారికి ఊరిటనిచ్చేలా వ్యాఖ్యానించారని విశ్లేషిస్తున్నారు.