Janasena: జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సైతం 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా జనసేనకు మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను సైతం పవన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు కేటాయించే నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. జనసేన తుది జాబితాను ఖరారు చేశారు. చంద్రబాబు సైతం దానిని ఆమోదించినట్లు తెలుస్తోంది.
జనసేన అడిగిన రెండు సీట్ల విషయంలో మాత్రం తీవ్ర తర్జన భర్జన పడినట్లు తెలుస్తోంది. ఆ రెండు స్థానాలు విషయంలో ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మిగతా 17 స్థానాలు విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కేలా చూసినట్లు సమాచారం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖ జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో రెండు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఒక్కోచోట జనసేనకు సీటు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి సీటును జనసేన ఆశిస్తోంది. అయితే ఆ సీటును టిడిపికి విడిచిపెట్టి మాడుగుల స్థానాన్ని తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నుండి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే అమలాపురం అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. ఆ స్థానంలో టిడిపికి మంచి అభ్యర్థి ఉన్నారు. అందుకే ఆ స్థానాన్ని విడిచిపెట్టి పి. గన్నవరం తీసుకోవాలని టిడిపి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక జనసేనకు కేటాయించిన సీట్లలో ఉన్న టిడిపి నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. జనసేన అభ్యర్థులకు సహకరించాలని చంద్రబాబుతో పాటు పవన్ కోరుతున్నారు.
ఇప్పటివరకు జనసేనకు ఖరారైన నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, విజయనగరంలో నెల్లిమర్ల, విశాఖలో విశాఖ దక్షిణ, పెందుర్తి/ మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, రాజోలు, రాజానగరం, అమలాపురం/పి. గన్నవరం, పిఠాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగటూరు, నిడదవోలు, పోలవరం, కృష్ణాజిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరులో తెనాలి, ప్రకాశం లో దర్శి, చిత్తూరులో తిరుపతి, అనంతపురంలో అనంతపురం, కడప జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం.