Janasena: ఏపీ రాజకీయాల్లో జనసేనది ఒక భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని.. పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. సరిగ్గా పదేళ్ల కిందట పార్టీని స్థాపించారు. 2014లో టిడిపి కి సపోర్ట్, 2019లో ఒకే ఒక్క సీటు. పోటీ చేసిన రెండు చోట్ల పార్టీ అధ్యక్షుడిగా పవన్ ఓటమి. గెలుస్తారనుకున్నంత నేతలంతా ప్లాప్. ఇది క్లుప్తంగా జనసేన రాజకీయ ప్రస్థానం. కానీ పవన్ కళ్యాణ్ ది విశాల దృక్పథం.ఆ ఆవిష్కరణ కోసమే ఆయన పాటుపడుతున్నారు. సరిగ్గా 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. నేటితో ఆ పార్టీ పది వసంతాలు పూర్తి చేసుకుంది. 11వ వసంతంలోకి అడుగుపెట్టనుంది.
పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర రంగంలో తనకంటూ ఒక అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్న స్టార్ హీరో. జనసేన మీటింగులకు వచ్చేవాళ్లు ఆ పార్టీకి ఓట్లు వేస్తే పవన్ ఈపాటికే సీఎం కుర్చీలో కూర్చుని ఉండేవారు. కానీ ఫ్యాన్ బేస్ జనసేన ను నిలబెట్టలేదు. జనసేనకు వచ్చే మద్దతు, బలం బలగం అంతా సోషల్ మీడియా, బహిరంగ సభల్లోనే ఇప్పటివరకు కనిపించింది. బ్యాలెట్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. సాంప్రదాయానికి భిన్నంగా రాజకీయాలు చేయడం, ఫ్యాన్స్ ను నమ్ముకోవడమే జనసేన బలమైన పార్టీగా ఎదగలేకపోతోందన్నది బహిరంగ రహస్యం. పూర్తిగా ఫ్యాన్ బేస్ మీద ఆధారపడ్డ జనసేనకు ఓట్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా పవన్ గుర్తించారు. గతంలో జరిగిన తప్పిదాలను అధిగమించే ప్రయత్నాలు ప్రారంభించారు. తన బలం మేరకు, తన పార్టీ బలం అనుసరించి వ్యూహాలు రూపొందించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇతర పార్టీలతో పొత్తు, సీట్ల సర్దుబాటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేనకు పటిష్టమైన విధానాలు ఉన్నాయి. నీతివంతమైన పాలన అందించగలరని భావన అధిక శాతం విద్యావంతుల్లో ఉంది. కానీ ఏపీ వంటి భిన్నమైన ఓటర్లు ఉన్నచోట ఢిల్లీ రాష్ట్ర తరహా రాజకీయాలు చెల్లుబాటు కావని గతంలోనే జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ద్వారా అర్థమయింది. ఇప్పుడు ప్రజలు సంక్షేమ పథకాలు, ఉచిత సేవలకు జై కొడుతున్నారు.ఈ విషయాన్ని పవన్ గుర్తించగలిగారు. పాత తరహా రాజకీయాలకు చెక్ చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా తనను తాను నిరూపించుకున్నారు. పార్టీని నిలబెట్టుకోగలిగారు. పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోగలిగారు. తాను సంపాదించిన సొమ్ముతో నిజాయితీగా పార్టీని నడిపించగలిగారు. అందుకే జనసేనలేని ప్రభుత్వాన్ని ఊహించుకోలేమని చెప్పి చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. అశేష భారతావనిని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ సైతం పవన్ తో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ రాష్ట్ర అవసరాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నట్లు పవన్ చెబుతున్నా.. జనసేన ను ఈ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకేనన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి అయితే పదేళ్లు ఓ ప్రాంతీయ పార్టీ మనుగడ సాధించడం అంత ఆషామాషీ కాదు. సరైన విజయం దక్కకుండా ఉనికి చాటుకోవడం విశేషమని చెప్పాలి. అది ఒక పవన్ కళ్యాణ్ కే సాధ్యమైంది. జనసేన 11వ వార్షికోత్సవం సందర్భంగా అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో పవన్ జనసేన జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.