MLA Panchkarla Ramesh Babu : టిడిపి కూటమి ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారా? నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడం పై అసంతృప్తికి గురయ్యారా? టిడిపి నేతల పెత్తనాన్ని సహించలేకపోతున్నారా? అందుకే తిరుగుబాటుకు ప్రయత్నించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ శత శాతం విజయం సాధించింది. రాష్ట్ర క్యాబినెట్లో మూడు మంత్రి పదవులను పొందింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నాలుగు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. టిడిపి తో పొత్తు మరో 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. జనసేన శ్రేణులకు సైతం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టిడిపి తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే టిడిపి కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు ఆయన. పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. ఇప్పటికే అక్కడ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనకు కాదని పంచకర్ల రమేష్ బాబుకు జనసేన తరఫున టికెట్ ఇచ్చారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి మాడుగులకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు.
* తీవ్ర అసంతృప్తి
అయితే పెందుర్తి నియోజకవర్గం లో తన మాట చెల్లుబాటు కావడం లేదన్నది పంచకర్ల రమేష్ బాబు బాధ. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇదే పెందుర్తి నుంచి గెలిచారు పంచకర్ల. బండారు సత్యనారాయణమూర్తి పై గెలవడంతో వారిద్దరికీ అంతగా పడడం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పట్టు పట్టారు బండారు సత్యనారాయణమూర్తి. చివరకు మాడుగుల వెళ్లినా..పెందుర్తి పై మాత్రం ఆశ చావలేదు. అందుకే పెందుర్తి పై పట్టు సాధిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పంచకర్ల రమేష్ బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
* చెల్లని సిఫార్సులు
తాజాగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. తన నియోజకవర్గంలోని పెందుర్తి, పరవాడ పోలీస్ స్టేషన్లలో అనుకూల అధికారుల కోసం లేఖలు ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే సిఫారసులు పని చేయలేదు. ఎమ్మెల్యే ఒకరిని సూచిస్తే.. మరొకరిని అక్కడ నియమించారు. సాక్షాత్ హోం మంత్రి వంగలపూడి అనిత ఇదే జిల్లాకు చెందినవారు. తన లేఖలకు కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో పంచకర్ల రమేష్ బాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అందుకే పోలీస్ శాఖ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకున్న సెక్యూరిటీని సరెండర్ చేశారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే టిడిపి కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* బండారు తీరే కారణం
పెందుర్తిలో పట్టు బిగించాలన్నది బండారు సత్యనారాయణమూర్తి ప్రయత్నం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరవాడ నియోజకవర్గం ఉండేది. అక్కడ సుదీర్ఘకాలం బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అతనికి అక్కడ క్యాడర్ ఉంది. అందుకే తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో కుమారుడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు కోరారు. అయితే పెందుర్తి జనసేనకు కేటాయించడంతో కొద్దిరోజులపాటు బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలో చేరతారని కూడా ప్రచారం సాగింది. అయితే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సత్యనారాయణమూర్తికి స్వయానా అల్లుడు. కింజరాపు కుటుంబం ఒత్తిడి మేరకు బండారు సత్యనారాయణమూర్తికి అప్పటికప్పుడు మాడుగుల టిక్కెట్ ఇచ్చారు. అయితే మాడుగులలో గెలిచినా.. పెందుర్తి పై మాత్రం ఆశ తగ్గలేదు. అందుకే తన మాటని నెగ్గించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇది పంచకర్ల రమేష్ బాబుకు ఇబ్బందిగా మారుతోంది. అందుకే ఆయన ప్రభుత్వానికి తెలియచెప్పేలా తన సెక్యూరిటీని సరెండర్ చేయడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Janasena mla panchkarla ramesh babu rebelled against the tdp alliance government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com