Pawankalyan Vs YCP : జన సైనికులు ఊహించిందే జరిగింది. పవన్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. బిగ్ సౌండ్ చేస్తూ పవన్ ఓ రేంజ్ లో జగన్ పై విరుచుకుపడ్డారు. రేపు భీమవరం సభలో చూడండి అంటూ ముందురోజే సంకేతాలు ఇచ్చిన పవన్.. అన్నంత పనిచేశారు. మిస్టర్ సీఎం జగన్ అంటూ సంభోదిస్తూ కడిగి పారేశారు. జగన్ హవాభావాలతోనే రిప్లయ్ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని అమ్మఒడి బటన్ నొక్కుడు కార్యక్రమంలో జగన్ పవన్ ను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ వైవాహిక జీవితంపై, చివరకు ఆయన మాట్లాడే తీరు, వారాహి వాహనంపై కూడా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి పవన్ నుంచి గట్టి రియాక్షనే వచ్చింది.

క్లాస్ వార్ నుంచి కరెప్షన్ వరకూ జగన్ చర్యలను పవన్ కడిగిపారేశారు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావ్.. నీతో పాటు నీ మంత్రుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే చెవుల నుంచి రక్తం కారుతుందని హెచ్చరించారు. చెవుల నిగ్గదీసుకొని విను అంటూ సూచించారు. మీ జీవితాల గురించి తనకు టోటల్ తెలుసన్నారు. నేనేమీ లండన్, అమెరికాలో చదువుకోలేదు. మీలా హైదరాబాద్ లోనే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా. మీ వేషాలన్నీ తనకు తెలుసని చెప్పారు. మీరే ఒక పెద్దమనిషికి పంపితే మీ గురించి తెలిసిన విషయాలన్నీ చెబుతానని కూడా చెప్పారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలన్న పెద్ద మనిషికి స్ట్రయిట్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. వ్యక్తిగత కామెంట్స్ మానుకుంటే మంచిదన్నారు.
అసలు క్లాస్ వార్ అంటే తెలుసా అని ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయినప్పుడు 122 గుండెలు ఆగిపోయాయని యాత్ర చేసిన పెద్దమనిషికి.. ఇసుక కొరతతో చనిపోయిన 32 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాటులు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. క్లాస్ వార్ అని సంభోదించే అర్హత జగన్ కు లేదని తేల్చిచెప్పారు. ఊగిపోతూ మాట్లాడుతానని కామెంట్స్ చేశారని.. పేదోడి కష్టం తెలిసిన వారు.. పాలకులుగా మీరు చేస్తున్న దాష్టీకాలకు, వికృత చేష్టలను బాధితులు నాకు చెప్పినప్పుడు ఊగకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అనే మహోన్నత వ్యక్తి.. తన పేరు చివర రెడ్డి వద్దని.. అది కుల అహంకారానికి చిహ్నమని.. పుచ్చలపల్లి సుందరయ్యగా మార్చుకున్నారని గుర్తుచేశారు. అటువంటి సాహసం మీరు చేయగలరా? అని ప్రశ్నించారు. మీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదని పవన్ తేల్చేశారు.
రాయసీలమలో సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ బాబును పోలీస్ స్టేషన్లోనే కొట్టి, లాకప్ లో వేసిన నేర చరిత నీది కాదా? అంటూ సీఎం జగన్ ను నేరుగా పవన్ ప్రశ్నించారు. అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ స్టేషన్లో చితకకొట్టించడం పెద్ద పని కాదని పవన్ తేల్చేశారు. పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం లేని వ్యక్తికి ఈ రోజు ఆ శాఖ అధికారులు సెల్యూట్ చేస్తుండడం దౌర్భాగ్యమన్నారు. ఇలాంటి రాష్ట్రంలో నేను పుట్టినందుకు నిజంగా సిగ్గు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించారు.. కానీ ఆ విశ్వాసాన్ని కూడా నిలుపుకోలేకపోయారని పవన్ ఎద్దేవా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను ఏపీ ప్రజలకు మీకు ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. గంజాయిని రాష్ట్రపంటగా తీర్చిదిద్దారు.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని మార్చారు. ఇదేనా వైసీపీ విశిష్ట పాలన? అని ప్రశ్నించారు. వైసీపీ పేరులో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ గా పెట్టుకున్న మీరు ఆశయాలను సాధించారా? అని ప్రశ్నించారు. యువజనులకు ఉద్యోగాలను దూరం చేశారు… శ్రామికులకు ఉపాధి లేకుండా చేశారు… రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకున్నారు… పార్టీ పేరులోని వర్గాలనే దగా చేసిన మీరా మాట్లాడేది అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. గాంధీ గారు తన జీవిత చరిత్ర రాసిన మై ఎక్స్ పెర్మెంట్స్ విత్ ట్రూత్ (సత్యశోధన) అనే పుస్తకం మాదిరిగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతం మై ఎక్స్ టార్సన్స్ ఇన్ ఏపీ స్టేట్ (అసత్యశోధన) పేరుతో పుస్తకం రాయొచ్చు అని పవన్ ఎద్దేవా చేశారు. భీమవరం సభలో సీఎం జగన్ కు పవన్ చుక్కలు చూపించారు.