Jana Sena Crisis Explained: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు ఉంది పరిస్థితి. లడ్డూ వివాదం నేపథ్యంలో రెండు పక్షాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. మరోవైపు జనసేనలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అధికార ప్రతినిధి కన్నా రజిని, పార్టీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ తదితరుల వ్యవహారాలు పార్టీకి ఇబ్బంది తెచ్చి పెడుతున్నాయి. ఇందులో ఆరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దానిపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు కన్నా రజనీ పార్టీ లైన్ దాటినట్టు కనిపిస్తున్నారు. బొలిశెట్టి రాజీనామా ప్రకటన కూడా ఒకింత అనుమానాలతోనే ఉంది. జనసేన చుట్టూ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు జనసైనికుల్లో కలుగుతున్నాయి. అదే సమయంలో జనసేన క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా టిడిపి, బిజెపి అనుకున్న విధంగా సహకారం అందించడం లేదని భావించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్ననే జరిగిన మూడు పార్టీల సమన్వయ సమావేశంలో.. ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఉపశమనం కలిగించే విషయం.
అప్పట్లో ప్రజారాజ్యంపై..
ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీ నుంచి గుణపాఠాలు నేర్చుకొని జనసేన ఆవిర్భవించింది. ప్రజారాజ్యం విషయంలో ఎలాంటి కుట్ర జరిగిందో ఇప్పటికీ చర్చగా ఉంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఒక్క ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీ ఎంతో కాలం నిలవలేదు ఏపీ రాజకీయాల్లో. అయితే అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం ప్రజారాజ్యం పార్టీ చుట్టూ రాజకీయాలు నడిచాయి. ఆ పార్టీని సాగనంపడంలో సొంతవారే క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పటి అధికార, ప్రధాన ప్రతిపక్షాల ధాటికి నిలబడలేకపోయింది ప్రజారాజ్యం. అయితే ఇప్పుడు కూడా జనసేన చుట్టూ అటువంటి కుట్రలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి.
పక్కా వ్యూహంతో..
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్( Arava Sridhar) పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక బలమైన వ్యూహం ఉంది. ప్రత్యేక ప్రణాళిక కనిపిస్తోంది. 25 కోట్ల రూపాయలు బాధితురాలు డిమాండ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని బాధితురాలు చెబుతోంది. తనను దూరం పెట్టడంతోనే తాను తట్టుకోలేక ఈ వీడియోలన్నీ బయట పెడుతున్నానని ఆమె చెబుతున్నారు. ఆమెకు పరిహారం అయినా దక్కాలి. లేకుంటే న్యాయమైన జరగాలి. కానీ ఆ కోణంలో చర్చ జరగడం లేదు. రోజుకో వీడియో బయటకు వస్తున్న క్రమంలో దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు కూడా అర్థం అవుతుంది. రాజకీయ ప్రోత్సాహంతోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది.
రాజకీయ ప్రేరేపితంతో?
మరోవైపు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కన్నా రజిని( Kanna Rajini ) చేసిన వ్యాఖ్యల వెనుక కూడా రాజకీయ ప్రేరేపితం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఆమె ఇప్పుడు సడన్ గా కాపు సామాజిక వర్గాన్ని బయటకు తీశారు. అంబటి రాంబాబు అరెస్టును తప్పుపడుతున్నారు. మరోవైపు బొలిశెట్టి సత్యనారాయణ ఇదే సమయంలో పదవులకు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ ఒక్కదాని తరువాత ఒకటి జరుగుతుండడం చూస్తుంటే రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..
