Jamili Elections: దేశంలో జమిలీ ఎన్నికలపై చాలా రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఈ ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేసుకున్నాయి. ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ ఎన్నికలతో తాము అధికారంలోకి రావచ్చు అని కలలు కంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ధీమాతోనే ఉంది. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. అయితే అప్పటినుంచి జమిలి ఎన్నికలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తూనే ఉన్నారు. ఇదిగో 2027లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పట్లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే ముందుగా జనగణన జరగాలి. అటు తర్వాత కులాల లెక్కలు తేల్చాలి. ఈ రెండు కావాలంటే మరో రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 2027లో జమిలీ లేనట్టే. 2029 లో మాత్రం అర్థ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఒకేసారి పార్లమెంట్, శాసనసభ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది జమిలి లక్ష్యం. తద్వారా ఐదేళ్లలో ఎన్నికలు అనే మాట లేకుండా పాలన సజావుగా ముందుకు తీసుకెళ్లవచ్చు అన్నది ఆలోచన. అయితే ఈ జమిలీపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. 2027 ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం సాగింది. అయితే అది ఎంత మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే 2026 ఏప్రిల్ నుంచి జన గణన ప్రారంభం అవుతుంది. 2027 ఫిబ్రవరి వరకు అది కొనసాగుతుంది. అటు తరువాత కుల గణన మొదలు పెట్టనున్నారు. అది పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్పటికే ఎన్నికలకు సమయం అవుతుంది. 2029 ఎన్నికలకు ఈ మూడు ప్రక్రియలు పూర్తి చేయగలరు. అందుకే జమిలి అనేది సాధ్యం కాదు.
* అర్థ జమిలీ కి అవకాశం
అయితే అర్థ జమిలి 2029లో పూర్తిచేసి.. 234 నాటికి మాత్రం పూర్తిస్థాయిలో జమిలి కి వెళ్లేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఓ రెండు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి సార్వత్రిక ఎన్నికలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అంటే 2029 ఎన్నికల కంటే ముందు చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అలా ఓ ఐదారు రాష్ట్రాల ఎన్నికలు ఆపి.. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఓ పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపితే ఈ ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది సత్ఫలితం ఇచ్చాక 2034లో నేరుగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది జనగణన ప్రారంభించడం ద్వారా జమిలీ లేనట్టేనని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు అందించగలిగింది.
* ఆశలు పెంచుకున్న వైసిపి..
ముందస్తు ఎన్నికలపై ఏపీలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అది పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకేనని తెలుస్తోంది. ఎందుకంటే ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీకి ఫలితం ఉండదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పై వ్యతిరేకత లేదు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే అవుతోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ప్రజలు వేచి చూసే ధోరణితో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చుకుంటే మాత్రం మెరుగైన స్థితిలో ఉంది కూటమి. ఈ దశలో ముందస్తు ఎన్నికలు జరిగినా అది కూటమికే కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే జమిలి ఎన్నికలపై ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం తగ్గించేసింది. 2029 ఎన్నికలపైనే ఫోకస్ చేసింది.