Constituencies Increase In AP: ఏపీలో( Andhra Pradesh) పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ విభజన సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే విభజన జరిగి పదేళ్లు దాటుతున్న ఇంతవరకు నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. దీనికి కారణం జనగణన, కుల గణన జరగకపోవడమే. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనగణన ప్రారంభం కానుంది. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అటు తరువాత కుల గణన మొదలుకానుంది. రిజర్వేషన్ల అంశము ఒక కొలిక్కి రానుంది. అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుంది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.
* 50 అసెంబ్లీ సీట్ల దాకా..
ఏపీలో దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజనలో పెరగనున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా ఇప్పుడు ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు గాను.. అదనంగా మరో 50 సీట్లు పెరుగుతాయి. 225 అసెంబ్లీ స్థానాలతో ఏపీ శాసనసభ కొలువుదీరనుంది. 294 అసెంబ్లీ స్థానాలతో పటిష్టమైన స్థితిలో ఉండేది ఉమ్మడి ఏపీ. 42 పార్లమెంట్ స్థానాలు ఉండేవి. తెలంగాణ విభజనతో ఆ రాష్ట్రానికి 117 అసెంబ్లీ సీట్లతో పాటు 17 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఏపీకి మాత్రం 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ స్థానాలు మిగిలాయి. పునర్విభజనతో ఏపీతోపాటు తెలంగాణలో సైతం సీట్లు పెరుగుతాయి.
* చివరిగా 2009లో..
చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు కేంద్రంలో యూపీఏ ( United progress Alliance) అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. ఆ సమయంలో పునర్విభజన జరగడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి లాభించింది. అప్పట్లో టిడిపికి బలమైన నియోజకవర్గాలను అడ్డగోలుగా చీల్చారు. రిజర్వేషన్లను సైతం మార్చేశారు. అయితే పునర్విభజన ఎప్పుడు జరిగినా అధికార పార్టీకి ప్రయోజనమే. పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆపై బిజెపి సైతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. పైగా మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సహజంగానే సీట్ల సంఖ్య పెరిగితే కూటమిలో అభ్యర్థులకు సర్దుబాటు చేయడానికి వీలుంటుంది. అయితే అధికార పార్టీలో సర్దుబాటు కాని వారు అసంతృప్తితో ఉంటారని.. వారంతా తమ వైపు వస్తారని అంచనా వేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.