CM Jagan: కడప అంటే వైఎస్ కుటుంబం… వైఎస్ కుటుంబమంటే కడప అన్న రేంజ్ లో అనుబంధం పెరిగిపోయింది. నాలుగున్నర దశాబ్దాల పాటు కడప జిల్లాను వైఎస్ కుటుంబం ఏలుతూ వస్తోంది. అంతటి ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ఆ కుటుంబానికి అడ్డు లేకుండా పోయింది. ముఖ్యంగా కడప ఎంపీ సీటుపై వైఎస్ కుటుంబానికి స్పష్టమైన ముద్ర ఉంది. సుదీర్ఘ కాలం ఎంపీలుగా ఆ కుటుంబం వారే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1984లో ఒక్కసారి మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో సైతం కడప ఎంపీ సీటు విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే చాన్స్ ఉంది. కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశముంది.
నాలుగున్నర దశాబ్దాలు వారిదే..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాక ముందు కడప ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అటు తరువాత ఆయన సోదరుడు వివేకానందరెడ్డి రెండుసార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు. తరువాత జగన్ ఎంపీగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండుసార్లు పోటీచేసి కేవలం ఐదేళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. అటు తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో ఆయనే ఎంపీగా ఎన్నికయ్యారు. అంటే సరాసరి 45 ఏళ్ల పాటు కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబం చెప్పుచేతల్లో ఉందన్న మాట.
తగ్గిన ప్రభ
అయితే వైఎస్ కుటుంబ ప్రభ.. మునుపటితో పోల్చుకుంటే చాలావరకూ తగ్గింది. రాజకీయంగా కంటే వైఎస్ కుటుంబంలో చిచ్చు రగిలింది. కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. ఎవరికి ఎవరూ కాకుండా పోతున్నారు. ఈ ప్రభావం కడప ఎంపీ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంపై పడే అవకాశముంది. సీఎం జగన్ కు మున్ముందు కుటుంబం నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన కుటుంబం నుంచి కడప ఎంపీ సీటు, పులివెందుల అసెంబ్లీ స్థానం చేజారకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
తాజా పరిణామాలతో..
వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర రెడ్డి ఇద్దరూ వైసీపీలో కీలకంగా ఉన్నారు. గత పన్నెండేళ్ళుగా కడప జిల్లాలో పార్టీని వారే చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఇపుడు వైఎస్ వివేకా హత్య కేసులో వారి చుట్టూ కేసుని సీబీఐ తిప్పుతోంది. వైఎస్ భాస్కర రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయం అలా ఆగి ఉంది. వివేకా హత్య కేసుపై కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి న్యాయపరంగా పోరాడుతోంది. ఆమెను టీడీపీ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తోంది అని అంటున్నారు. సునీతా రెడ్డి కనుక ఓకే అంటే ఆమెను పులివెందుల అసెంబ్లీ నుంచి అయినా లేక కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీకి దింపాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్.
కొత్త పేర్లు..
భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లేని లోటను అదే కుటుంబంతో పూడ్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అయిన డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దించారు. ఆయనకు పులివెందుల బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది ఇక వచ్చే ఎన్నికల్లో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు.డాక్టర్ గా జనంలో మంచి పేరు ఉన్న అభిషేక్ రెడ్డి నవ యువకుడు. ఆయన పట్ల జనంలో మంచి అభిప్రాయం ఉంది. ఇక వైఎస్ దుష్యంత్ రెడ్డి అని కొత్త పేరు ఒకటి ఇపుడు బయటకు వస్తోంది. ఈయన వరసకు జగన్ కి సోదరుడు అవుతారు అని అంటున్నారు. ఈయనను కమలాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దించి పోటీ చేయించే ఆలోచన ఉందని అంటున్నారు. కమలాపురం అంటే జగన్ మేనమామ అయిన రవీంద్రారెడ్డి నియోజకవర్గం. ఆయన రెండు సార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన పనితీరు మీద జనంలో వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఆయన్ని తప్పిస్తారు అని అంటున్నారు. అంటే వైఎస్ కుటుంబం నుంచి కడప చేజారకుండా జగన్ గట్టి ప్లాన్ చేస్తున్నారన్న మాట.