Jagan: ఇటీవల విజయవాడలో విచారణ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసులకు భయపడవద్దని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైలు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కూటమి నాయకులు విహారయాత్రలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రచారం చేసుకున్న ఆయన.. ఇప్పుడు వాటిని మర్చిపోయారని జగన్ విమర్శించారు.. కూటమి ప్రభుత్వం పై ప్రజలకు తీవ్రస్థాయిలో నిరాశ ఏర్పడిందని.. అది త్వరలో మరింత పెరిగి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని జగన్ మండిపడ్డారు.
గుంటూరు మిర్చి యార్డులో..
మిరప ధరలు ప్రస్తుతం విపరీతంగా పడిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. నేరుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడి రైతులను పరామర్శించారు. మిర్చి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన నేపథ్యంలో ఆయన అభిమానులు చుట్టుముట్టారు. కనీసం ఆయనను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా గుమి గుడారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభిమానుల తాకిడి వల్ల ఇబ్బంది పడ్డారు.. స్వయంగా ఆయనే కల్పించుకొని మాట్లాడటంతో అభిమానులు పక్కకు జరిగారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. వారి నష్టాలను స్వయంగా చూసి చలించిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎండ బాగా ఉండటం.. పైగా అది మిర్చి యార్డ్ కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తుమ్ములు రావడంతో ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకున్నారు. అయితే మిర్చి ఘాటు వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖం మొత్తం నల్లగా మారిపోయింది. చివరికి ఆయనకు మాట కూడా సరిగా రాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైసీపీ శ్రేణులు దీనిని పాజిటివ్ కోణంలో ప్రచారం చేస్తుండగా.. టిడిపి శ్రేణులు మాత్రం నెగటివ్ వేల ప్రచారం చేస్తున్నాయి.. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి దెబ్బకు రాజన్న గుర్తుకు వచ్చాడని.. ఐదు సంవత్సరాలు రైతుల కష్టాలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డికి.. ఇప్పుడు మిర్చి రైతులు గుర్తుకు వచ్చారని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ” ఎగుమతులు తగ్గిపోయాయి. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కి లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారా? నాడు చేయకుండా.. నేడు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు ఏమిటని” వారు జగన్మోహన్ రెడ్డి పై మండిపడుతున్నారు.