Jagan: వైసీపీ అభ్యర్థులు మారనున్నారా? కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదా? అక్కడ ఓటమి భయం జగన్ ను వెంటాడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపాలపాయలోని రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఏకంగా ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జగన్. సోషల్ ఇంజనీరింగ్ ను తెరపైకి తెచ్చి అభ్యర్థులను ప్రకటించారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సక్రమంగా జరగదని.. ఓట్ల బదలాయింపు కుదిరే పని కాదని అంచనా వేశారు. కానీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. వివాదాలు సమసి పోతున్నాయి. కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చకపోతే నష్టమని జగన్ భావిస్తున్నారు. సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.
చంద్రబాబు ఈసారి మొహమాటలకు పోలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా లాంటి వారిని సైతం పక్కన పెట్టారు. మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను గెలుపు గుర్రం గా భావించి టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ ఏదో ఊహించుకొని ద్వితీయ శ్రేణి నాయకుడు అయిన సర్నాల తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అయితే అక్కడ తిరుపతిరావు బాగా వెనుక బడటంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. మంత్రి జోగి రమేష్ తో పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ ను పెనమలూరు పంపించారు. కానీ అక్కడ జోగి రమేష్ కు అనుకున్న స్థాయిలో అనుకూలత లేదు. పైగా గతంలో మైలవరం నుంచి పోటీచేసిన అనుభవం ఉండడంతో.. అక్కడే సర్దుబాటు చేయాలన్న ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి విడదల రజిని సీటు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. ఆమె చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ ఆ నియోజకవర్గంలో ఆమె పరిస్థితి ఏమంత బాగాలేదు. దీంతో ఆమెను తీసుకెళ్లి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే అక్కడ కూడా పరిస్థితి బాగా లేకపోవడంతో.. గుంటూరు పార్లమెంట్ స్థానానికి పంపించాలని జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఎంపీగా ఖరారు అయిన కిలారి రోశయ్యను గుంటూరు పశ్చిమ సీటుకు పంపించనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇటీవల జనసేన నుంచి వైసీపీ లోకి వచ్చిన పోతిన మహేష్ పేరును విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇదివరకే ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయనను తప్పించనున్నారు.
కడప ఎంపీఅభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిని కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.అక్కడ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.టిడిపి నుంచి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీకి పంపించి.. పార్లమెంట్ స్థానాన్ని తీసుకోవాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు వివేక హత్య కేసు అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో.. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ఎక్కడ అభ్యర్థిని మార్చితేనే ప్రయోజనం ఉంటుందన్న ఫీలింగ్ తో జగన్ ఉన్నారు. అక్కడ వైయస్ అభిషేక్ రెడ్డిని రంగంలో దించాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే సీఎం జగన్ భయపడుతున్నారు. అభ్యర్థుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.