Duvvada Srinivas meets Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు( AP assembly sessions ) హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. తన పదిమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి సరిగ్గా 11 నిమిషాల పాటు ఉండి.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మరి బయటకు వచ్చేశారు. ఆ సమయంలోనే సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు పలకరించారు. తన పక్కన నడిపించుకుని మాట్లాడుకుంటూ తీసుకెళ్లారు. ఓసారి వచ్చి కలవమని చెప్పారు కూడా. జగన్ అలా పిలవడంతో దువ్వాడ కూడా సరేనన్నారు. కలుస్తానని ప్రకటించారు. పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించాలని దువ్వాడను జగన్ కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే దువ్వాడ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గానే మాట్లాడుతున్నారు. నిన్ననే తిరుమల లడ్డూ వివాదం పై మాట్లాడుతూ అధికార పార్టీ నేతలపై విమర్శలు చేశారు.
జగన్ కు వీర విధేయుడిగా
దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) ఎప్పటికీ తాను వైయస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడునని చెబుతుంటారు. తన కోపం అంతా ధర్మాన బ్రదర్స్ పై అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. కొద్ది రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పలేదు. ఆయన దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. పార్టీ ఇమేజ్ కు భంగం కలిగిందని చెప్పి ఆయనను సస్పెండ్ చేశారు. కానీ అసలు నిజం ధర్మాన బ్రదర్స్ తో దువ్వాడ శ్రీనివాస్ కు విభేదాలు కారణమని పొలిటికల్ వర్గాలకు తెలుసు.
అదే తీరులో దువ్వాడ..
అయితే తాజాగా జగన్ ( Y S Jagan Mohan Reddy ) తనతో మాట్లాడిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన బ్రదర్స్ పై రెచ్చిపోయారు. ధర్మాన సోదరులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యింది అంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్ కు గురైన దువ్వాడ శ్రీనివాసును జగన్ కలవమనడం ఏంటి? పార్టీ వాయిస్ వినిపించాలని సూచించడం ఏంటి? త్వరలో కలవాలని సూచించడం ఏంటి? ధర్మాన సోదరులపై దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోవడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే జగన్ ధర్మాన సోదరులను బెదిరించడానికి ఈ పని చేశారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొన్న మధ్యన ధర్మాన కృష్ణ దాస్ పై రెచ్చిపోయారు దువ్వాడ శ్రీనివాస్. తనపై దాడికి దిగాలంటూ సవాల్ చేశారు.
ధర్మానకు పార్టీ బాధ్యతలు..
అయితే ధర్మాన ప్రసాదరావు ( dharmana Prasad Rao )ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలో తాడేపల్లి కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేసి వైసిపి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడిచింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులపై మాత్రం విమర్శలు తగ్గించలేదు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాసును జగన్మోహన్ రెడ్డి చేరదీయడం చూస్తుంటే మాత్రం ధర్మాన సోదరులకు ప్రాధాన్యం తగ్గినట్టే. తాను పార్టీలోకి రావాలంటే ధర్మాన సోదరులను పట్టించుకోవద్దని జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ శ్రీనివాస్ కోరినట్లు ప్రచారం నడుస్తోంది. మరి ధర్మాన సోదరులను జగన్ వదులుకుంటారా? లేకుంటే వారి మధ్య సంధి చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.