Balineni Srinivasa Reddy: బాలినేని ముఖం చూడని జగన్.. ఇక తుది నిర్ణయమే

గత మూడు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సీఎం సమావేశం అవుతూ వస్తున్నారు. కుమారుడు ప్రణీత్ రెడ్డిని తీసుకుని బాలినేని విజయవాడ వచ్చారు. గత మూడు రోజులుగా ఓ హోటల్ లో ఉంటున్నారు.

Written By: Dharma, Updated On : January 11, 2024 9:10 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని ముఖం చూడడానికి కూడా జగన్ ఇష్టపడడం లేదు. మూడు రోజులుగా విజయవాడలో అందుబాటులో ఉన్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన బాలినేని.. విజయవాడలో హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొంతకాలంగా జగన్ తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. కానీ జగన్ బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. వచ్చి ఎన్నికల్లో బాలినేని సీటును కూడా ఖరారు చేయలేదు. దాదాపు పక్కన పడేసినట్టేనని సంకేతాలు ఇవ్వడంతో.. ఇప్పుడు బాలినేనికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.

గత మూడు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సీఎం సమావేశం అవుతూ వస్తున్నారు. కుమారుడు ప్రణీత్ రెడ్డిని తీసుకుని బాలినేని విజయవాడ వచ్చారు. గత మూడు రోజులుగా ఓ హోటల్ లో ఉంటున్నారు. సమన్వయకర్త విజయసాయిరెడ్డి తో పాటు సీఎంవో అధికారి ధనుంజయ రెడ్డితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. కానీ అధినేత జగన్ ను కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో దీనిని అవమానంగా భావిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం కీలక నాయకులతో చర్చలు జరిపారు. వేచి ఉండడం కంటే వెళ్లిపోవడమే ఉత్తమమని ఆలోచనకు వచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. ఇదే నా గౌరవం అంటూ నిట్టూర్చినట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాదు బయలుదేరి వెళ్లిపోయినట్లు సమాచారం.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేని రాజకీయంగా ఎటువైపో అన్న చర్చ బలంగా నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడితో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని ఎంపీ మాగుంట పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ టికెట్ రాదని ఒక అంచనాకు వచ్చి ప్రత్యామ్నాయాలపై సీరియస్ గా దృష్టి సారించారు. ఎంపీ మాగుంట కుటుంబానికి మరోసారి టికెట్ ఇప్పించి వైవి సుబ్బారెడ్డి ఏంట్రీ లేకుండా చేయాలని బాలినేని ప్లాన్ చేశారు. కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి రూ.179 కోట్లు కావాలని తొలి నుంచి బాలినేని కోరుతూ వచ్చారు. దానిని సైతం జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా వరుస అవమానాలు భరించే కంటే పార్టీ నుంచి వెళ్లిపోవడమే ఉత్తమమని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం.

మాగుంట శ్రీనివాసులరెడ్డి వరకు టిడిపి ఓకే చెబుతున్నా.. బాలినేని విషయంలో మాత్రం టిడిపి క్లారిటీ ఇవ్వలేకపోతోంది. అటు బాలినేని సైతం వైసీపీని వీడేందుకు తట పటాయిస్తున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఒంగోలు సీటు విషయంలో చంద్రబాబుకు పవన్ ఒప్పించగలరా? లేదా? అని బాలినేని అనుమానించారు. మాగుంటకు ఎంపీ సీటు, తనకు ఒంగోలు సీటు కేటాయిస్తే ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే వరుస అవమానాలు నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అని వారి పరిస్థితి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎదురైనట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.