Jagan: జగన్ ధోరణి మారి తీరాలి

జగన్ గురించి సొంత పార్టీ నేతలు ఒకలా మాట్లాడుతారు.. ఇతరులు మరోలా విశ్లేషిస్తారు. జగన్ కు పొగరు ఎక్కువ అని అనేవారు ఉన్నారు. జగన్ అందరితో కలివిడిగా ఉంటారని.. ఎదుటివారిని గౌరవిస్తారని చెప్పినవారు ఉన్నారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 3:19 pm

Jagan

Follow us on

Jagan: వైసిపి ఆవిర్భావం తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయం ఇది. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు జగన్.తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. తాను ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లతో దాదాపు అధికారపక్షంతో సరి సమానంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రాగలిగారు. కానీ ఈ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇది గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. కోలుకోలేని మూల్యం చెల్లించుకోవడం ఖాయం.ఇన్ని రోజులు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను మలుచుకుని ముందుకు సాగాల్సిన సమయం కూడా ఇదే.

పార్టీ ఆవిర్భావం నుంచి విజయాలను తనకు అన్వయించుకున్నట్టే.. ఓటమి బాధ్యతను కూడా జగనే తీసుకోవాలి. తనను తాను సంస్కరించుకోవాలి. ఓటమికి ఈవీయంలో, నేతల పనితీరుపైనో నెపం పెట్టకుండా ఉండాలి. తనలో ఉన్న మైనస్లను గుర్తించాలి. విమర్శలను స్వాగతించాలి. ఆ విమర్శలో ఉన్న అసలు లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. అప్పుడే ఓటమికి గల కారణాలు తెలుస్తాయి. వాటిని అధిగమించేందుకు దోహదపడతాయి.గత ఎన్నికల్లో జగన్ మాదిరిగానే చంద్రబాబుకు సైతం భారీ ఓటమి ఎదురైంది. చంద్రబాబు టార్గెట్ అయ్యారు. మొత్తం ఓటమికి ఆయనే బాధ్యత తీసుకున్నారు. తనను తాను మార్చుకున్నారు. అసలు నిలబడదనుకున్న తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు మార్చుకున్నారు.

జగన్ గురించి సొంత పార్టీ నేతలు ఒకలా మాట్లాడుతారు.. ఇతరులు మరోలా విశ్లేషిస్తారు. జగన్ కు పొగరు ఎక్కువ అని అనేవారు ఉన్నారు. జగన్ అందరితో కలివిడిగా ఉంటారని.. ఎదుటివారిని గౌరవిస్తారని చెప్పినవారు ఉన్నారు. కానీ ఆయన విషయంలో మంచి కంటే చెడు ఎక్కువగా బయటకు వెళ్ళింది. ఆయన చేసే మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపింది. మునుపటిలా ఉంటే కుదిరే పని కాదు. తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం. అందుకే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. గత ఐదేళ్లుగా క్యాడర్ కు, జగన్ కు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అదికూడా పూడ్చుకోవాలి. తప్పులు ఉంటే సరిదిద్దాలి. భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. 2029 లో వచ్చేది మనమే అని ధైర్యం నూరి పోయాలి.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత.. ఆ పార్టీ శ్రేణులు బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఇలా చేసిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీ శ్రేణులను పూర్తిగా నైరాశ్యంలో పడేశాయి. అయినా సరే నేనున్నాను అంటూ చంద్రబాబు భరోసా ఇవ్వగలిగారు. సర్వశక్తులను కూడదీసుకుని పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు.ఏడుపదుల వయసులో అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ యువకుడు. పైగా ఐదు సంవత్సరాల సమయం ఉంది. రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్న పార్టీ వైసిపి. లక్షలాదిమంది క్రియాశీలక నాయకులు ఉన్న పార్టీని యాక్టివ్ చేసి పని చేయించడం మరి అంత కష్టం కాదు. అందుకే జగన్ బయటకు వచ్చి తన దూకుడు తనాన్ని ప్రదర్శిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. బలమైన ప్రతిపక్షంగా మారే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవాలను మరిచి తనను తాను సంస్కరించకుంటే మూల్యం చెల్లించుకునేది జగనే. గత అనుభవాలను నెమరు వేసుకొని.. తనకు కలిసి వచ్చిన దూకుడు తనాన్ని ప్రదర్శిస్తే మాత్రం వైసిపి అనతి కాలంలోనే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఇక ఆలోచించుకోవాల్సింది జగనే.