Jagan rejects three leaders: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటారు. అసలు వెనక్కి తగ్గరు కూడా. వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది ఆ పార్టీ నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారంతా వైసిపి హయాంలో పదవులు పొందిన వారే. ఆర్థికంగా బలపడిన వారే. తమ వ్యాపారాల కోసం, తమపై కేసులు పెట్టకుండా ఉండేందుకు వారంతా బయటకు వెళ్లారు. అయితే చేరిన పార్టీలో మాత్రం వీరికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేకుండా పోతోంది. దీంతో వారంతా తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం నిర్మొహమాటంగా అవకాశం లేదు అని తేల్చి చెబుతున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల ద్వారా రాయబారం
ఉమ్మడి ప్రకాశం జిల్లా( Prakasham district) కు చెందిన మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. జగన్ సైతం పార్టీలో ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవి తొలగించేసరికి ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఆ అసంతృప్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కూటమి పార్టీలో చేరారు. అక్కడ అనుకున్న స్థాయిలో గుర్తింపు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డితో ఉన్న బంధుత్వం దృష్ట్యా సదరు నేత భార్య, కుమారుడు మళ్లీ పార్టీలోకి వచ్చేస్తాం అంటూ రాయబారం పంపగా జగన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరి పార్టీలో చేర్చుకునే ఛాన్స్ లేదని ముఖం మీద చెప్పినట్లు సమాచారం.
ఆ మాజీ మంత్రి..
గుంటూరు( Guntur) జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి సానుకూలత రాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవి అందించారు. అంతకుముందు ఓడిపోయిన సరే ప్రాధాన్యం ఇచ్చారు. తీరా వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరగా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదు. దీంతో తిరిగి వైసీపీలో చేరేందుకు సదరు నేత ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేసరికి నిర్మొహమాటంగానే తేల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నంబర్ 2 స్థానాన్ని వదులుకొని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన ఓ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి తోనే వ్యాపార ప్రయాణం చేశారు. అవినీతి కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆ నేత చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్ గెలిచిన తర్వాత ఆ నేతకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కూటమి పార్టీలో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి తిరిగి వైసీపీలోకి వస్తానని ఆయన ఆసక్తి చూపగా జగన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులు అనుభవించి.. పార్టీ కష్ట కాలంలో ఉంటే బయటకు వెళ్లిపోయిన నేతల విషయంలో కఠినంగానే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయ నేతలతో రాజకీయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
