Kuppam: కుప్పం నీళ్ల కథ.. ఇంతకీ ఎవరి వాదన కరెక్ట్

ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం కుప్పంలోని రామకుప్పం ప్రాంతంలో గేటు ఎత్తి, బటన్ నొక్కి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గంలోకి విడుదల చేశారు.

Written By: Suresh, Updated On : February 28, 2024 1:39 pm
Follow us on

Kuppam: ఏపీలో ఎన్నికలకు ఇంకా ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుండటంతో ఎక్కడ చూసినా రాజకీయపరమైన చర్చే జరుగుతోంది. సహజంగా ఏపీలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అందులోనూ అక్కడ మీడియా కూడా పార్టీలవారీగా ఎప్పుడో విడిపోయింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వార్తలు రాస్తాయనే విమర్శలుండగా.. సాక్షి జగన్ కోణంలోనే వార్తలు ప్రచురిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు టిడిపి అనుకూల మీడియా, ఇటు వైసిపి అనుకూల మీడియా రెచ్చిపోయి వార్తలు ప్రచురిస్తున్నాయి.

ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం కుప్పంలోని రామకుప్పం ప్రాంతంలో గేటు ఎత్తి, బటన్ నొక్కి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గంలోకి విడుదల చేశారు. “కుప్పాన్ని పురపాలకంగా మార్చాం. అధునాతన ఆసుపత్రులు నిర్మించాం. రోడ్లు వేయించాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాం. అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. చంద్రబాబు నాయుడు ఏనాడైనా కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకున్నారా” అంటూ జగన్ విమర్శలు చేశారు. సహజంగా జగన్ పర్యటనకు ఆయన అనుకూల మీడియా, ఇంకా కొన్ని చానల్స్ అమితమైన ప్రాధాన్యాన్ని ఇచ్చాయి..

సాధారణంగానే ఒక ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వచ్చినప్పుడు మీడియా తప్పనిసరిగా కవరేజీ ఇస్తుంది. అదేంటో గాని జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి, ఈనాడు కవరేజీ ఇవ్వలేదు. పైగా ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎక్కడో లోపల పేజీలో ప్రచురించాయి. పై పెచ్చు అందులోనూ వ్యతిరేక కోణాన్ని ప్రదర్శించాయి. పైగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఫస్ట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు అందించే కార్యక్రమం పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టారని, ఆయన నీళ్లు విడుదల చేస్తున్నప్పుడు ఉపయోగించిన గేట్ ను తర్వాత అధికారులు తొలగించారని.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో.. ఆ గేటును మళ్లీ యథా స్థానం లో ఏర్పాటు చేశారని ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పూర్తిగా చంద్రబాబు పాజిటివ్ కోణంలోనే ఉన్నట్టు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

కాకపోతే ఇన్ని రోజులు కుప్పం నియోజకవర్గానికి నీళ్లు రాలేదు అని జగన్ మోహన్ రెడ్డి చెప్తుంటే.. దానికి సరైన స్థాయిలో టిడిపి కౌంటర్ ఇవ్వలేకపోయింది. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని జగన్ విమర్శిస్తే.. దాన్ని టిడిపి అనుకూల మీడియా టాకిల్ చేయలేకపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తిన గేటు ఆగమేఘాల మీద తొలగించారని, తర్వాత బిగించారని, ఇందులో ఆంతర్యం ఏమిటని టిడిపి అనుకూల మీడియా వార్తలు రాస్తే.. అది తప్పు అని సాక్షి ఖండించలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఇన్ని రోజుల నుంచి నీళ్లు ఎందుకు రాలేదు? దశాబ్దాల నుంచి ఎందుకు ఇంత వివక్షకు గురైంది? కుప్పానికి ఇప్పుడు నీళ్ళు వస్తే అవి అంతలోనే ఎందుకు ఆగిపోయాయి? హడావిడిగా ఏర్పాటు చేసిన గేటు తర్వాత ఎందుకు తొలగించారు? అనంతరం ఎందుకు బిగించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేనంత స్థాయిలో ప్రజలు లేరని.. కచ్చితంగా ఈ ఎన్నికల్లో వారు తమ ఓటుతో స్పష్టమైన తీర్పు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.