AP Liquor Case: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. దాదాపు ఈ కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఓ 12 మంది అరెస్టు అయ్యారు. మరి కొంతమంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన అరెస్టు ఇంతవరకు జరగలేదు. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయ్యారు రాజ్ కసిరెడ్డి. అనంతరం వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పని చేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప రెస్ట్ అయ్యారు. అటు తర్వాత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్. అక్కడకు కొద్ది రోజులకే రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీంతో ఇక తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం నడిచింది. అయితే ఈ కుంభకోణంలో జగన్ కుటుంబ సభ్యులకు సైతం ప్రముఖంగా వినిపించాయి.
Also Read: టార్గెట్ వైసిపి.. కాంగ్రెస్ లోకి బలమైన కుటుంబం?
సంచలన అంశాలు..
తొలి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పేరు ప్రస్తావనకు తరచూ వచ్చింది. దీంతో అంతిమ లబ్ధిదారుడు ఆయనేనన్న టాక్ వినిపించింది. జగన్ అరెస్టు జరుగుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇది రాజకీయ కక్షపూరిత కేసుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానించింది. ఈ కేసు నిలబడదని కూడా చెప్పుకొచ్చింది. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కుంభకోణంలో ఉన్న నిందితులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు డబ్బుల నోట్ల కట్టలు లెక్కబెడుతూ కనిపించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మరోవైపు చార్టెడ్ ఫ్లైట్లో ప్రముఖ హీరోయిన్ తో ఉన్న సెల్ఫీ కూడా హల్చల్ చేసింది. ప్రత్యేక విమానంలో డబ్బుల నోట్ల కట్టలు తరలిస్తున్న ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము అని.. తాడేపల్లి ప్యాలెస్ కు తరలించే ప్రయత్నంలో భాగంగా చిక్కిన ఫోటోలేనని టిడిపి కూటమి ఆరోపిస్తోంది. అయితే సిట్ చేతికి ఇలాంటి ఫోటోలు, వీడియోలు చాలా చిక్కినట్లు ప్రచారం నడుస్తోంది.
రాజ్ కసిరెడ్డి సమీప బంధువు..
అయితే ఈ లిక్కర్ కుంభకోణంలో( liquor scam) ప్రధాన నిందితులంతా జగన్మోహన్ రెడ్డికి బంధువులేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు అని టిడిపి సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు రాజ్ కసిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం ఆయన జగన్మోహన్ రెడ్డి కోటరీలో చేరిపోయారు. మద్యం కంపెనీలు నిర్వహించే రాజ్ కసిరెడ్డికి జగన్ ఈమధ్య కుంభకోణం బాధ్యతలు అప్పగించినట్లు వెంకట రమణారెడ్డి ఆరోపించారు. అయితే రాజ్ కసిరెడ్డి ఎవరో కాదని.. వైయస్ సుజాత రెడ్డి స్వయానా అల్లుడని సంచలన ప్రకటన చేశారు ఆనం. స్వయానా మేనత్త అల్లుడు కావడం, మద్యం వ్యాపారంలో అనుభవం ఉండడంతోనే జగన్ తన కోటరీలోకి రాజ్ కసిరెడ్డిని తీసుకొచ్చారని టిడిపి నేత తాజాగా ఆరోపించారు. తద్వారా ఈమద్యం కుంభకోణంలో వైయస్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ.
Also Read: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!
లోతైన దర్యాప్తు..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీని మార్చారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. ఈ తరుణంలో మద్యం తయారు చేసే కంపెనీలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. డిష్టలరీలను సైతం తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకొని.. భారీగా కమీషన్లు దండుకున్నారని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దాదాపు 18 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని.. 3500 కోట్ల రూపాయలు వైసీపీ నేతలు కొల్లగొట్టారని సీట్ తేల్చింది. అయితే ఈ మొత్తం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మద్యం కుంభకోణమే అన్నదే జరగలేదని వైసిపి ఆరోపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రాజ్ కసిరెడ్డి సమీప బంధువు అని తేలడం మాత్రం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. ఈ అంశాన్ని టిడిపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే మద్యం మకిలి జగన్ కుటుంబానికి అంటిందన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..?