Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Family Controversy: జగన్ రాజకీయంలో 'ముద్రగడ' కుటుంబం!

Mudragada Family Controversy: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

Mudragada Family Controversy: ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన వైద్య సేవలకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై ముద్రగడ చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనమీద ఎన్నో అపవాదులు వేసుకున్నారు ముద్రగడ. కానీ పార్టీ నుంచి మాత్రం ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు సరి కదా.. ఇప్పుడు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైన భరోసా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం ముద్రగడను పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. దానిని తప్పు పట్టారు ముద్రగడ కుమార్తె క్రాంతి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రిని పరామర్శించే సమయం లేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ కు పరామర్శించే సమయం ఉంటుంది కానీ. పార్టీ కోసం పని చేసిన మా నాన్న లాంటి వారికి కనీసం సమయం కేటాయించలేరా అంటూ క్రాంతి నిలదీసినంత పని చేశారు.

* ఫ్యామిలీలో విభేదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ముద్రగడ పద్మనాభం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుటుంబంలోనే తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం ప్రయత్నం చేశారు. అయితే అది వైసిపి ప్రయోజనం కోసం పని చేసేందుకే అని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే ఆయనను దూరం పెట్టారు. దీంతో కుమారుడిని తీసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ముద్రగడ. కానీ తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమార్తె క్రాంతి మాత్రం జనసేనకు మద్దతు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం నేరుగా జనసేనలో చేరారు క్రాంతి. కానీ వైసీపీ వ్యూహాలకు లోబడి ముద్రగడ తన సొంత కుమార్తె పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.

* పరామర్శ లేదు..
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ముద్రగడను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ విషయాన్ని కుమార్తె క్రాంతి ప్రశ్నించేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ముద్రగడ కుమార్తెను తిట్టిన క్లిప్పింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముద్రగడ కుటుంబంలోనే చిచ్చుపెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి. మరోవైపు ఒక మహిళ న్యాయవాది ముద్రగడను ఆసుపత్రిలో పరామర్శిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నట్టు ప్రచారం చేసుకుంటుంది వైసిపి.

* ట్రాప్ లో పెద్దాయన..
ముద్రగడ పద్మనాభం వైసీపీ ట్రాప్ లో పడ్డారని ఇట్టే అర్థం అవుతోంది. వైసిపి కోసం పనిచేసే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని సైతం తాకట్టు పెట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు వైసీపీ రాజకీయం ఆ కుటుంబంలో కూడా కల్లోలం రేపుతోంది. ఈ సమయంలో భరోసా ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. ముద్రగడ కాకపోతే మరో కాపు నేత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ లాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఇతర కాపు నేతలు జాగ్రత్త పడితేనే మంచిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version