Vundavalli Aruna Kumar New Story: ప్రస్తుతం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli arunkumar) రాజకీయాల్లో లేరు. ఏ పార్టీతోను ఆయనకు సంబంధం లేదు. విశ్లేషకుడు అవతారం ఎత్తారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పే ఆయన మాటల్లో ఒక భావజాలం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలం వెలుగు చూస్తుంది. కానీ అది ఆయన పసిగట్టరు. జగన్మోహన్ రెడ్డి పై కూడా ఫేవర్ ఉంటుంది. అలాగని దానిని బయట పెట్టలేరు. కేవలం ఈ రాష్ట్రానికి మంచి కావాలి.. మంచి జరగాలి అన్న పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అది కూడా గత వైసిపి పాలనలో అటువంటి మాటలు చెప్పేవారు కాదు. ఇప్పుడు మాత్రం కొత్తగా ప్రతిపక్షం రావాలి.. పవన్ ప్రతిపక్షం కావాలి.. కూటమి విడిపోవడం తన ఉద్దేశం కాదని.. జనసేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కొత్త పల్లవి అందుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
మార్గదర్శి పై పోరాటం..
ఒక్క ఖాతాదారుడు కూడా ఫిర్యాదు చేయలేదు. తమకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. కానీ మార్గదర్శి(margadarshi) చిట్ ఫండ్ లో అన్యాయం జరిగిందని సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు రామోజీరావు చనిపోయినా వెంటాడుతూనే ఉన్నారు. దానిని పక్కన పెడితే రాష్ట్ర విభజన సవ్యంగా జరగలేదని చెప్పి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానికి కౌంటర్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తో పెట్టించలేకపోయారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సర్కార్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎంతగానో విభేదించి.. శత్రువుగా చూసే రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ పై.. జగన్ సర్కార్ తో పిటిషన్ వేయించ గలిగారు ఉండవల్లి. కానీ రాష్ట్ర విభజన పిటిషన్ మాత్రం వేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వేయాలని డిమాండ్ చేయడమే కాదు… లాజిక్కులుగా ఎన్నో విషయాలు చెబుతున్నారు.
పవన్ ప్రతిపక్ష పాత్ర..
ఉండవల్లి అరుణ్ కుమార్ తన స్నేహితుడు కుమారుడు జగన్ అని పేవర్ చూపించడమే కానీ.. జగన్ నుంచి ఆ స్థాయిలో ఫేవర్ ఉండదన్న విషయం ఆయనకు తెలుసు. అలాగని టిడిపిని సమర్థించలేరు. చంద్రబాబు నాయకత్వాన్ని ఒప్పుకోరు. ఆయన పనితీరును ప్రశంసించే మనసు రాదు. అలాగని కూటమి విచ్ఛిన్నం కావడం లేదు. చంద్రబాబును పవన్ విభేదించడం లేదు. మూడు పార్టీల మధ్య మైత్రి రోజు రోజుకు పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చూస్తే బలం పుంజుకోవడం లేదు. పైగా తనలాంటి మేధావి చెప్పిన విషయాలను పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు పవన్ లాంటి వ్యక్తి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఉండవల్లి లాంటి వారు చెబుతుండడం వెనుక ఉన్న కథ ఇట్టే అర్థమవుతోంది.